భూభారతితో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

by Taduka Kalyani |

జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో భూభారతి రీ-సర్వే చేపట్టిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

భూభారతితో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
X

దిశ, బజార్‌హత్నూర్, జూలై 17: జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో భూభారతి రీ-సర్వే చేపట్టిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం బజార్‌హత్నూర్ మండలం గంగాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి భూముల సర్వే గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం డెడ్రా, మాన్కాపూర్ గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. గంగాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ సభలో మాట్లాడిన కలెక్టర్, జిల్లాలో చివరిసారిగా 1934లో భూముల సర్వే జరిగిందని, ఇప్పుడు అత్యాధునిక యంత్రాలతో మళ్లీ రీ-సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 509 గ్రామాలకు గాను మొదటి విడతలో 70 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించామని, గతంలో నక్షాలు, రికార్డులు లేని నాన్-కాడస్ట్రల్ గ్రామాల్లో ఇప్పటికే సర్వే చేపట్టినట్లు వెల్లడించారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం గ్రామ సరిహద్దులను ఖరారు చేసి వ్యవసాయ, వ్యవసాయేతర భూములను డిజిటలైజ్ చేస్తామని, ప్రతి భూమికి ఆధార్ కార్డు తరహాలో 'భూధార్ కార్డు' అందజేస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా భూముల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరిగి కుటుంబ సభ్యుల మధ్య, ఇతరుల మధ్య తలెత్తే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. జిల్లాలో, ముఖ్యంగా బజార్‌హత్నూర్ మండలంలో వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతోందని, సూపర్ ఎల్‌నినో ప్రభావం కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటల్లో తేమ నిల్వ ఉండేందుకు మల్చింగ్ పద్ధతి పాటించాలని, కలుపు మొక్కలను తొలగిస్తూ 2 శాతం ఫోలియర్ స్ప్రే వినియోగించాలని సూచించారు. వర్షాలు లేకపోతే కందులు, పెసర్లు, మినుములు వంటి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గుచూపాలని పిలుపునిచ్చారు.

Next Story