ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి

by Ratna Kumari |

దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగును రైతులు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి
X

దిశ, ఎల్లారెడ్డిపేట : దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగును రైతులు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో 18 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కల నాటే కార్యక్రమంలో బుధవారం కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో పంటల వైవిధ్యీకరణ, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా మంచి ఆదాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. జిల్లాకు సమీపంలోని సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉండటంతో రైతులకు మార్కెటింగ్ సౌలభ్యం కలుగుతుందని చెప్పారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని, వెయ్యికి పైగా ఎకరాల్లో మెగా ప్లాంటేషన్ చేపట్టేందుకు వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖలతో పాటు డ్రిప్, మొక్కలు సరఫరా చేసే సంస్థల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో కలిపి 34 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇందులో గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు రాజేందర్ రెడ్డి ఒక్కరే 18 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. యూరియా అవసరమున్న రైతులు ఫెర్టిలైజర్ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకుని కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేట్ ఎరువుల డీలర్ల వద్ద సహాయకులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అవసరమైన సూచనల కోసం వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సబేరా బేగం, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story