ఎల్‌నినో ప్రభావం పై సమీక్ష... ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలి !

by Batti.Sumithra |

రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున, ప్రజలకు తాగునీటి ఎద్దడి, రైతులకు పంట నష్టం వాటిల్లకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావం పై సమీక్ష... ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలి !
X

దిశ, హుస్నాబాద్ : రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున, ప్రజలకు తాగునీటి ఎద్దడి, రైతులకు పంట నష్టం వాటిల్లకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గురువారం హుస్నాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్‌లో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ పీఠభూమి ప్రాంతం కావడం వల్ల సాధారణంగానే వర్షాభావం ఉంటుందని, ఈసారి ఎల్‌నినో వల్ల పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశముందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

వరి సాగు వద్దు.. ఆరుతడి వైపు మొగ్గు!

శాస్త్రవేత్తల నివేదికల ప్రకారం వచ్చే జూన్ వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకపోవచ్చని, అందుకే రైతులను ముందస్తుగా సమాయత్తం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. అడుగంటిపోతున్న భూగర్భ జలాల దృష్ట్యా రైతులు వరి వేసి నష్టపోవద్దని, మొక్కజొన్న, కందులు, చిరుధాన్యాలు, కూరగాయలతో పాటు ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతు వేదికల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. నర్మెట్టలో ఫ్యాక్టరీ అందుబాటులో ఉన్నందున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, 100 నుంచి 200 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేసే గ్రామానికి ₹5 లక్షల ప్రత్యేక గ్రాంట్ అందిస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పాడిపశువుల యూనిట్లు మంజూరు చేస్తామన్నారు.

నీటి సంరక్షణ – సంక్షేమం..

'తెలంగాణ జలసిరి', విబీజీ రామ్‌జీ (VBG RAMG) పథకాల ద్వారా ప్రతి పొలంలోనూ ఫామ్ పాండ్స్ నిర్మించి, ఇంకుడు గుంతలు విరివిగా తవ్వించాలని ఆదేశించారు. ఎల్‌ఎమ్‌డీ నుంచి నిరంతరాయంగా తాగునీరు సరఫరా అయ్యేలా చూస్తూ, వారానికోసారి భూగర్భ జలమట్టాల నివేదికలు అందించాలన్నారు. హుస్నాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు గతంలో ప్రారంభించిన స్టీల్ బ్యాంక్ కార్యక్రమాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు.

అధికారులు సన్నద్ధం..

సిద్దిపేట కలెక్టర్ కే. హైమావతి మాట్లాడుతూ... వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు పండించేలా కంటింజెన్సీ నివేదికలు సిద్ధం చేశామని, పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ... ఎల్‌ఎమ్‌డీ, ధర్మసాగర్ నీటి మట్టాలను పర్యవేక్షిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ... రైతు వేదికల ద్వారా పంట మార్పిడి, ఆయిల్ పామ్ సాగుపై చైతన్యం కల్పిస్తూ, తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నామని వివరించారు.

అభివృద్ధి పనుల వేగవంతం..

గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణకు రూ.250 కోట్లు మంజూరయ్యాయని, పనులు వేగవంతం చేయాలని మంత్రి తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల, 250 పడకల ఆసుపత్రి, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, ఫోర్‌లేన్ రోడ్డు, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story