- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కోసం రాజంపేట సొసైటీ వద్ద రైతుల ఆందోళన
ఆన్లైన్‌లో బుక్ చేసుకున్నప్పటికీ యూరియా అందడం లేదంటూ రాజంపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.

దిశ, రాజంపేట: ఆన్లైన్‌లో బుక్ చేసుకున్నప్పటికీ యూరియా అందడం లేదంటూ రాజంపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు సోమవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నా క్షణాల్లో స్టాక్ ఖాళీ అయిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్ విధానాన్ని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విధానం కారణంగా సకాలంలో యూరియా దక్కడం లేదని, ఆన్లైన్‌లో యూరియా బుక్ చేసుకోవడం ఎలా అనే విషయంపై సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు సొసైటీ సీఈఓను నిలదీశారు.
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
యూరియా అందడం లేదని ఆవేదన చెందిన రాజంపేట గ్రామానికి చెందిన కుమ్మరి వెంకట్ అనే రైతు స్థానిక సొసైటీ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చున్నా యూరియా అందకపోవడం, ఆన్లైన్‌లో యూరియా బుక్ చేసుకోవడంపై అవగాహన లేకపోవడంతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు రైతులు తెలిపారు. సకాలంలో స్పందించిన పోలీసులు రైతును అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం అక్కడికి చేరుకున్న తహసీల్దార్ జానకి రైతును సముదాయించి నచ్చజెప్పారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆన్లైన్‌లో బుక్ చేసుకున్న రైతులకు మంగళవారం ఉదయం యూరియా పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ జానకి, వ్యవసాయ అధికారి, సొసైటీ సీఈఓ రైతులకు వివరించడంతో ఆందోళన విరమించారు.






