వెంకన్న మృతి బాధాకరం.. అండగా ఉంటాం: మంత్రి పొన్నం

by Vemula.Srinu Prasad |

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ ) వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ..

వెంకన్న మృతి బాధాకరం.. అండగా ఉంటాం: మంత్రి పొన్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ (డీటీఓ) వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీతో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సైతం ఈ ప్రమాదంపై స్పందించి, విచారణ జరపాలని ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. వెంకన్న ఇటీవలనే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారని, ఆయన స్వగ్రామం మహబూబాబాద్ సమీపంలోని మరిపెడ బంగ్లా అని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన ఒక హార్వెస్టర్‌ను రవాణా శాఖ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో, ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగి వెంకన్న ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

అండగా ఉంటాం.. శవ రాజకీయాలు వద్దు...

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. ఇలాంటి దురదృష్టకర సమయంలో ఎవరూ శవ రాజకీయాలు చేయవద్దని ఆయన హితవు పలికారు. రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘాను మరింత పెంచామని, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా మైనింగ్, గ్రానైట్, ఫ్లై యాష్ రవాణా చేసే వాహనాలు నిబంధనలు మీరితే ఊపేక్షించేది లేదన్నారు. అయితే, సిబ్బంది ప్రాణాల మీదకు తెచ్చుకునేంత స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ చేయడం లేదని, ప్రాథమిక విచారణ ప్రకారం ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనేనని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వాహనాల సంఖ్య, వేగం పెరిగిన నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో పారదర్శకత కోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్‌లను ప్రవేశపెడుతున్నామని, పూర్తిస్థాయి డ్రైవింగ్ నైపుణ్యాలు ఉన్నవారికే లైసెన్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రవాణా శాఖ సిబ్బంది ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.

డీటీఓ వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం

విధి నిర్వహణలో ఉన్న భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (టీడీఓ) వెంకన్న మృతి అత్యంత విషాదకరమని అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అధ్యక్షులు రవీందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వెంకన్న తన విధుల నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు, రవాణా రంగానికి విశేష సేవలందించారని కొనియాడారు. ఆయన అకాల మరణం రవాణా శాఖకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తీరని లోటని పేర్కొన్నారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వెంకన్న కుటుంబానికి అసోసియేషన్ తరఫున అన్ని విధాలుగా అండదండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

Next Story