- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు..
భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను హత్య చేసిన ఘటనలో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

దిశ, రేగోడ్: తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను హత్య చేసిన ఘటనలో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపురం గ్రామానికి చెందిన లక్ష్మికి సుమారు 20 సంవత్సరాల క్రితం రేగోడ్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన కూతూరి కేశయ్యతో వివాహం జరిగింది. కొంతకాలం సజావుగా సాగిన వీరి దాంపత్య జీవితంలో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కేశయ్య ఎనిమిదేళ్ల క్రితం ఆమెతో విడిపోయాడు. అనంతరం లక్ష్మి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను పోషించుకుంటూ జీవనం సాగిస్తుందని చెప్పారు. 2023 జనవరి 16న మేనమామను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా వాగు సమీపంలో కాపుకాసిన కేశయ్య ఆటోను అడ్డగించి ఆటో డ్రైవర్‌ను కత్తితో బెదిరించి లక్ష్మిపై కత్తితో దాడి చేసి హత్య చేయడంతో పాటు ఆమె అక్కపై కూడా దాడి చేశాడు.
విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్..
ఈ ఘటనపై అప్పటి ఎసై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. అల్లాదుర్గం సీఐ జార్జ్ పూర్తి దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సేకరించి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి రేణుకారెడ్డి సాక్షులను కోర్ట్ లో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. కోర్టు లైజనింగ్ అధికారి ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీవో వినోద్ సమన్వయంతో కేసు విచారణ జరిగింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితుడు కూతూరి కేశయ్యను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని పేర్కొన్నారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు లైజనింగ్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.






