Core Sector: ఏడు నెలల కనిష్ఠ స్థాయికి కీలక రంగాల వృద్ధి

by S Gopi |

2025, అక్టోబర్ తర్వాత దేశ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం ఇంతటి బలహీనమైన వృద్ధిని చూడటం ఇదే మొదటిసారి.

Core Sector: ఏడు నెలల కనిష్ఠ స్థాయికి కీలక రంగాల వృద్ధి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత పారిశ్రామిక ప్రగతికి దిక్సూచిగా నిలిచే ఎనిమిది కీలక రంగాల (కోర్ సెక్టార్) వృద్ధి రేటు భారీగా మందగించి, ఏడు నెలల కనిష్ట స్థాయికి చేరింది. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, మే నెలలో కీలక రంగాల వృద్ధి 0.5 శాతానికి పడిపోయింది. ఏప్రిల్ నెలలో నమోదైన 1.8 శాతం వద్ధితో పోలిస్తే ఇది తీవ్రమైన క్షీణతగా చెప్పవచ్చు. 2025, అక్టోబర్ తర్వాత దేశ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం ఇంతటి బలహీనమైన వృద్ధిని చూడటం ఇదే మొదటిసారి. దీనికి ప్రధాన కారణం.. దేశీయ ఇంధన, మైనింగ్ విభాగాల్లో వచ్చిన తీవ్రమైన పతనమే. మే నెలలో బొగ్గు ఉత్పత్తి ఏకంగా 9.3 శాతం పడిపోగా (ఏప్రిల్‌లో 8.8 శాతం క్షీణత), ముడి చమురు (క్రూడాయిల్) ఉత్పత్తి 4.6 శాతం, సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ఉత్పత్తి 4.9 శాతం చొప్పున కుప్పకూలాయి. వీటన్నింటికీ మించి పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు ఏకంగా 8.7 శాతం పడిపోవడం ఎనర్జీ రంగంలో ఉన్న తీవ్ర ఒత్తిడిని సూచిస్తోంది. మరోవైపు వ్యవసాయానికి కీలకమైన ఎరువుల ఉత్పత్తి కూడా 0.9 శాతం మేర తగ్గింది.

ఆదుకున్న కన్‌స్ట్రక్షన్, పవర్ రంగాలు

ఇంధన రంగాలు నిరాశపరిచినా, దేశ మౌలిక సదుపాయాల రంగాలు మాత్రం గట్టిగా నిలబడి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పడిపోకుండా కాపాడాయి. మే నెలలో సిమెంట్ ఉత్పత్తి 8.4 శాతానికి పెరగ్గా, ఉక్కు ఉత్పత్తి 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. వీటికి తోడు ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి, విద్యుదుత్పత్తి ఏప్రిల్‌లోని 5.6 శాతం నుంచి మే నెలలో ఏకంగా 8.7 శాతానికి చేరింది.

Next Story