- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమస్యల వలయంలో రైతువేదికలు
ములకలపల్లి మండలంలోని ములకలపల్లి, పూసుగూడెం, జగన్నాధపురం, పొగళ్లపల్లి గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు ప్రస్తుతం నిధుల కొరత, సిబ్బంది లేకపోవడంతో సమస్యల వలయంలో చిక్కుకున్నాయి.

దిశ, ములకలపల్లి: ములకలపల్లి మండలంలోని ములకలపల్లి, పూసుగూడెం, జగన్నాధపురం, పొగళ్లపల్లి గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు ప్రస్తుతం నిధుల కొరత, సిబ్బంది లేకపోవడంతో సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. రైతులకు వ్యవసాయ సలహాలు, అవగాహన కార్యక్రమాలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలు ప్రస్తుతం కనీస నిర్వహణకు నోచుకోవడం లేదు. సమావేశాల నిర్వహణ వంటి పనుల కోసం ఒక్క అటెండర్ లేకపోవడం గమనార్హం. దీంతో అధికారులు, రైతులే స్వయంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
విద్యుత్ బిల్లులు పెండింగ్..
పలు రైతు వేదికల్లో విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉండగా, కొన్ని చోట్ల ఫ్యాన్లు, లైట్లు పనిచేయడం లేదు. వేసవి కాలంలో భవనాల లోపల తీవ్రమైన వేడి ఉండడంతో రైతులు ఎక్కువ సేపు సమావేశాల్లో కూర్చోలేకపోతున్నారు. టాయిలెట్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నీటి ట్యాపులు, మోటార్లు తరచూ చెడిపోవడం, మరమ్మతులకు నిధులు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల డోర్లు చెదలు పట్టి పాడైపోగా, కిటికీలు, గేట్లు, నేమ్‌బోర్డులు తుప్పు పట్టి అధ్వానంగా మారాయి. ఫెన్సింగ్ ధ్వంసమై భవనాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
పరికరాలకు రక్షణ లేదు..
రైతు వేదికల్లో సుమారు రూ.3 లక్షల విలువైన వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు ఉన్నప్పటికీ వాటికి ఎలాంటి రక్షణ ఏర్పాటు చేయలేదు. దీంతో విలువైన ప్రభుత్వ ఆస్తుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సమస్యల పై నివేదిక అందించాం: ఏఓ అరుణ్ బాబు
రైతు వేదికల నిర్వహణ సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిక అందించామని ఏఓ అరుణ్ బాబు తెలిపారు. అటెండర్ నియామకం, నెలవారీ నిర్వహణ నిధులు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, కంప్యూటర్లు-ప్రింటర్ల ఏర్పాటు, పాడైన మౌలిక వసతుల మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉన్నతాధికారులను కోరామని అన్నారు.






