వర్షాలు లేక డ్రిప్ శరణ్యం.. నడిగడ్డ రైతుల ఆవేదన!

by Jakkula.Mamatha |

వర్షాకాలం ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని నడిగడ్డ ప్రాంత రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

వర్షాలు లేక డ్రిప్ శరణ్యం.. నడిగడ్డ రైతుల ఆవేదన!
X

దిశ, అలంపూర్/ఉట్కూర్: వర్షాకాలం ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని నడిగడ్డ ప్రాంత రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆకాశంలో రోజు మేఘాలు కమ్ముకోవడం, భారీ ఈదురుగాలులు వీయడం తప్ప.. ఆశించిన స్థాయిలో చుక్క వర్షం కూడా కురవకపోవడంతో రైతన్నలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు. గత 25 రోజులుగా ఒక్క సరైన వర్షం కూడా లేకపోవడంతో సాగు చేసిన మిర్చి, పత్తి పంటలను కాపాడుకోవడానికి రైతులు మునుపెన్నడూ లేని విధంగా అగచాట్లు పడుతున్నారు.

మొక్కు ప్రాణం పోయడానికే..

సాధారణంగా పంటల్లో ఎక్కువ దిగుబడి సాధించడం కోసం రైతులు వాటర్ డ్రిప్(బిందు సేద్యం), తుంపర నీటి పద్ధతులు ఆశ్రయిస్తుంటారు. కానీ, నడిగడ్డ చరిత్రలోనే మొదటిసారిగా కేవలం వేసిన మిర్చి, పత్తి విత్తనాలు మొలవడానికి, ఉన్న పంటను బతికించుకోవడం కోసమే డ్రిప్ సిస్టమ్ వాడాల్సిన దయనీయ స్థితి ఏర్పడిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆకాశం నుంచి వర్షం పడకపోవడంతో.. డ్రిప్ ద్వారా నీటి చుక్కలను కృత్రిమ వర్షం మాదిరిగా కురిపిస్తూ పంటలకు ప్రాణం పోసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఎకరాకు రూ.50 వేల అదనపు భారం..

భూమిలో నాటిన గింజలు నాటినట్లే ఎండి పోతుండటంతో, వర్షం వస్తుందనే ఆశతో రైతులు ఇప్పటికే మూడు నుంచి నాలుగు సార్లు విత్తనాలను మళ్లీ మళ్లీ విత్తుకున్నారు. విత్తన ఖర్చులు, డ్రిప్ సేద్యం ఏర్పాటు చేస్తుండటంతో ఎకరాకు ఇప్పటికే 30 వేల నుంచి 50 వేల వరకు అదనపు పెట్టుబడి భారం పడిందని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని మానవపాడు, ఇటిక్యాల, అలంపూర్, వడ్డేపల్లి మండలాల్లో గత నెల రోజులుగా కరువు తాండవిస్తోంది. ఇక్కడి కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.

'ఆర్డీఎస్' కాలువే దిక్కు..

వర్షాలు మొహం చాటేసిన తరుణంలో.. కనీసం ఆర్డీఎస్ కాల్వకైనా సరైన నీరు వస్తే పంటలను బతికించుకుంటామని నడిగడ్డ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి ఆర్డీఎస్ కాలువ ద్వారా కనీసం నెల రోజుల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని, నష్టపోయిన కౌలు రైతులతో సహా అందరికీ తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.

ఊట్కూర్‌లో ఎదుగుదల కోల్పోతున్న పత్తి పంట..

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో వర్షాభావం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సీజన్ ప్రారంభంలో కురిసిన స్వల్ప వర్షాలను నమ్ముకుని పత్తి సాగు చేసిన రైతులు, ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో పంట ఎండుముఖం పట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలలో తేమ తగ్గిపోవడంతో పత్తి మొక్కల ఎదుగుదల మందగించి, ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం చేసిన పెట్టుబడి తిరిగి వస్తుందో లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.మరోవైపు చెరువులు, కుంటలు నిండకపోవడంతో భూగర్భ జలాలు పెరగలేదు. బోర్లలోనూ నీటి మట్టాలు తగ్గుతుండటంతో రానున్న వరి సాగుపై రైతుల్లో అనిశ్చితి నెలకొంది. ఇప్పటికైనా మంచి వర్షాలు కురిసి చెరువులు నిండితే పత్తి పంటతో పాటు వరి సాగుకు కూడా ఊరట లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story