ఎల్ నినో ప్రభావం గురించి రైతుల్లో అవగాహన కల్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

by Batti.Sumithra |

ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులకు ఈ విషయమై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

ఎల్ నినో ప్రభావం గురించి రైతుల్లో అవగాహన కల్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులకు ఈ విషయమై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా నీటి ఎద్దడిని తట్టుకునే ఆరుతడి పంటలను విత్తుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఎల్ నినో వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పంటల సాగుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.

రాష్ట్రంలోని 18 జిల్లాలలో లోటు వర్షపాతం నెలకొని ఉందని వాతావరణ శాఖ అధికారులు మంత్రులు దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం సగటున 887 మిల్లీ మీటర్లు కురియాల్సి ఉండగా, 673 మిల్లీమీటర్ల మాత్రమే కురిసిందని, 24శాతం లోటు వర్షపాతం నమోదు అయ్యిందని వివరించారు. గోదావరి, కృష్ణా బేసిన్ లలో కూడా 20 నుంచి 25 శాతం లోటు వర్షపాతం నెలకొని ఉందని అన్నారు. ఎగువన గల మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలతో పాటు తెలంగాణలోని సింగూరు, మిడ్ మానేరు, కడెం, శ్రీశైలం, జూరాల, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టులలో గత ఏడాదితో పోలిస్తే తక్కువ నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు కీలక సూచనలు చేశారు. నీటి ఆధారిత పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే విధంగా రైతులకు ఎల్ నినో ప్రభావం గురించి తెలియజేయాలన్నారు. నీటి ఆధారిత పంటలు వేసినట్లయితే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున రైతులు నష్టపోతారు అనే విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. శ్రీరాంసాగర్ తదితర రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన పక్షంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేసేందుకు వీలుగా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని అన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల దారి మళ్లింపు వంటి వాటికి ఆస్కారం లేకుండా గట్టి పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి ప్రకాష్, డీఎస్ఓ శ్రీకాంత్, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story