- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాలతో చిగురించిన ఆశలు.. పొలం బాట పట్టిన రైతన్నలు!
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపాయి.

దిశ, పాల్వంచ రూరల్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. భూమిలో తగినంత తేమ ఏర్పడటంతో పాల్వంచ మండలంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఏరువాక పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే రైతులు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లతో పొలం బాట పట్టి దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం, నాట్లు వేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులతో సందడి నెలకొంది.
ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ తదితర పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాలు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది మంచి దిగుబడులు వస్తాయనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది. గత కొన్నేళ్లుగా వర్షాభావం, పెట్టుబడి భారం, పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈసారి ప్రకృతి సహకరిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అయితే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు సకాలంలో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎరువుల కొరత లేకుండా చూడాలని, రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల వ్యవసాయ సామగ్రి అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వ్యవసాయ అధికారులు రైతులకు పంటల ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువుల వినియోగం, పురుగు మందుల వాడకం పై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగిస్తే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందని చెబుతున్నారు.ఈసారి ప్రకృతి మాపై కరుణిస్తేనే మా కుటుంబాలు నిలబడతాయి. మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, గిట్టుబాటు ధరలు లభించాలని రైతులు కోరుకుంటున్నాం" అని పలువురు రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయమే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఏరువాకతో పొలాల్లో మొదలైన ఈ సందడి.. రైతు ఇంట్లో ఆనందాలు నింపాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.






