ట్యాంకర్లతో పంటను కాపాడేందుకు రైతు పోరాటం

by Malleboina Mahesh |

గంగాధర మండలంలో సాగునీటి సంక్షోభం! పంటను కాపాడుకోవడానికి రోజుకు రూ. 10 వేలు ఖర్చు చేసి ట్యాంకర్లతో బావిని నింపుతున్న రైతు. నారాయణపూర్ కాలువ పనులు పూర్తి చేయాలని డిమాండ్.

ట్యాంకర్లతో పంటను కాపాడేందుకు రైతు పోరాటం
X

దిశ, గంగాధర : ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ రైతుల కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయి. పంట చేతికి వచ్చే కీలక సమయంలో వ్యవసాయ బావులు, బోర్లలో నీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమ పంటను కాపాడుకోవడానికి అసాధారణ మార్గాలను అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. గంగాధర మండలంలోని తాడిజెర్రి గ్రామానికి చెందిన ఒక రైతు వ్యవసాయ బావి ఆధారంగా వరి సాగు చేపట్టాడు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటను పెంచుతున్న సమయంలో బావిలో నీరు పూర్తిగా ఎండిపోవడంతో ఆ రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

పంట నష్ట పోకుండా కాపాడుకోవడానికి ఆయన ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి బావిలో పోయిస్తా సాగు కొనసాగిస్తున్నాడు. ఒక్కో ట్యాంకర్‌కు దాదాపు రూ.1000 చెల్లించాల్సి వస్తుండగా, రోజుకు సుమారు 10 ట్యాంకర్ల నీటికి దాదాపుగా రూ.10000 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు రైతు వాపోతున్నాడు. బావి నుంచి పైపుల ద్వారా మడికి నీటిని అందిస్తూ పంటను నిలబెట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం మండలంలో చర్చనీయాంశంగా మారింది.‘ఇప్పుడే నీరు లేకపోతే పంట పూర్తిగా నష్టపోతుంది. ఇంతవరకు పెట్టిన ఖర్చు అంతా వృధా అవుతుంది’ అంటూ రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక గంగాధర మండలంలోని రైతులు కూడా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నారాయణపూర్ కుడి కాలువ పనులు పూర్తి కాకపోవడంతో సాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ కాలువ మొత్తం పొడవు 17 కిలోమీటర్లు ఉండగా, దాదాపు 16 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయినప్పటికీ, మిగిలిన భాగం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. ప్రత్యేకంగా కరీంనగర్ – జగిత్యాల ప్రధాన రహదారిపై కాలువ వెళ్లాల్సి ఉండటంతో అక్కడ పనులు నిలిచిపోయినట్లు సమాచారం. కుడి కాలువకు అనుబంధంగా 11 ఉప కాలువలు ఉండగా, వాటిలో కేవలం ఒకదానిపై మాత్రమే పనులు ప్రారంభమై, మిగిలిన పది పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం రైతులను నిరాశకు గురి చేస్తోంది.

ఉపకాలువలు పూర్తి చేయాలి

భూసేకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ పనులు వేగంగా కొనసాగకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నారాయణపూర్ కుడి కాలువ తో పాటు ఉప కాలువల పనులను త్వరగా పూర్తి చేస్తే తమ సాగునీటి సమస్యలు పూర్తిగా తీరుతాయని వారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక వైపు ట్యాంకర్లతో బావి నింపుకుంటూ పంటను కాపాడుకునే రైతు పోరాటం.. మరోవైపు పూర్తి కాలేని కాలువల కోసం ఎదురు చూస్తున్న రైతుల ఆవేదన.. ఇవి అన్నీ కలిసి గ్రామీణ వ్యవసాయ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.

Next Story