మూడు రోజులుగా రైతులకు ఇక్కట్లు..

by Batti.Sumithra |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి, కోటార్‌మూర్ ప్రాంతాల రైతులు మామిడిపల్లి అగ్రికల్చర్ ఫీడర్ సమస్యతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.

మూడు రోజులుగా రైతులకు ఇక్కట్లు..
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి, కోటార్‌మూర్ ప్రాంతాల రైతులు మామిడిపల్లి అగ్రికల్చర్ ఫీడర్ సమస్యతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు ఆకాశం వైపు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పాటు విద్యుత్ లైన్ల సమస్య కారణంగా గత మూడు రోజులుగా రైతులకు సరిపడా విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యుత్ లైన్లలో ఉన్న సమస్యలను గుర్తించేందుకు అధికారులు మూడు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరి నారు పోసుకుని నాట్లు వేసేందుకు దుక్కులను సిద్ధం చేసుకునే సమయంలో విద్యుత్ సమస్య తలెత్తడంతో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.

ఒకరు నాటడం.. మరొకరు కొట్టడం.. ఇదేంటో..?

అడవుల విస్తీర్ణం పెంచే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హరితహారం, వనమహోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాయి. అడవుల విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాల్లో అటవీ, గ్రామపంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు మొక్కలు నాటిస్తుండగా, మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు వాటినే నరికివేయాల్సిన పరిస్థితి ఏర్పడటం విడ్డూరంగా మారింది. భావితరాలకు సహజ వనరులను అందించాలనే ఉద్దేశంతో మొక్కలు నాటడం మంచి విషయమే. అయితే మొక్కలు నాటే సమయంలో సంబంధిత మూడు శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించకపోవడం వల్ల ప్రజాధనంతో నాటిన మొక్కలను తర్వాత నరికివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

సమస్యలు తలెత్తకుండా విద్యుత్ వైర్ల కింద చెట్ల కొమ్మలను కొట్టకపోతే ఎలా..!

ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం, వనమహోత్సవ కార్యక్రమాల్లో కనీస అవగాహన లేకుండా విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటడం వల్ల ప్రజాధనం వృథా అవుతోంది. అటవీ, గ్రామపంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులు లక్ష్యాల పేరుతో రోడ్ల వెంట విద్యుత్ వైర్ల కింద మొక్కలు నాటుతున్నారు. ఈ మొక్కలను నర్సరీల్లో పెంచడం నుంచి నాటడం వరకు ప్రజాధనమే ఖర్చవుతోంది. కాలక్రమేణా ఆ మొక్కలు పెరిగి విద్యుత్ లైన్లకు అడ్డంకిగా మారడంతో ప్రజలకు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు వాటిని నరికివేయాల్సి వస్తోంది. సంబంధిత శాఖల నిర్లక్ష్యం వల్ల ప్రజాధనంతో పెంచిన మొక్కలే విద్యుత్ సరఫరాకు ఆటంకంగా మారుతున్నాయి. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించేందుకు విద్యుత్ లైన్లను క్రమబద్ధీకరించే సమయంలో లైన్లకు అడ్డంగా ఉన్న చెట్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు.

ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటుండగా, మొక్కలు నాటే సమయంలో ఇతర శాఖల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ శాఖ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో విద్యుత్ లైన్మెన్ రాజశేఖర్ ప్రజల కోసం విద్యుత్ లైన్ల కింద పెరిగిన వేప చెట్ల కొమ్మలను తొలగించగా, అటవీ శాఖ అధికారులు ఆయనకు రూ.22 వేలకుపైగా జరిమానా విధించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, గత మూడు రోజులుగా మామిడిపల్లి అగ్రికల్చర్ ఫీడర్‌లో ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు లైన్మెన్ సతీష్, అసిస్టెంట్ లైన్మెన్లు ప్రభు, అరుణ్‌లు ఆ ప్రాంతంలోని ప్రతి విద్యుత్ లైన్‌ను తనిఖీ చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే రోడ్డు వెంబడి విద్యుత్ లైన్లకు అడ్డుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు.

విద్యుత్ డిమాండ్ మేరకు నూతన సబ్‌స్టేషన్ ప్రతిపాదనలు ఏమయ్యాయి..!

ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని కోటార్‌మూర్ ప్రాంతంలో ఉన్న ఆర్మూర్ నియోజకవర్గ పద్మశాలి ఫంక్షన్ హాల్ పక్కన ప్రభుత్వ స్థలంలో నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటు కోసం ఇటీవల విద్యుత్ శాఖ అధికారులు పరిశీలన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సబ్‌స్టేషన్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించినప్పటికీ, ఆ ప్రతిపాదనల పరిస్థితి ఏమైందో తెలియడం లేదని స్థానికులు అంటున్నారు. గత మూడు రోజులుగా విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోటార్‌మూర్ ప్రాంత రైతులు నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Next Story