- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌నీనోపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది: మంత్రి ఉత్తమ్‌కుమార్
ఎల్‌నీనోపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉన్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురువారం ఎల్‌నీనోపై సెక్రెటేరియట్‌లో మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్‌నీనోపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉన్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురువారం ఎల్‌నీనోపై సెక్రెటేరియట్‌లో మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నీనో ప్రభావానికి అనుగుణంగా జిల్లా వారీ కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అన్ని పరిస్థితిలను నిరంతరం పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమన్వయంతో కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలన్నారు.
గ్రామసభల ద్వారా రైతులకు ఎల్‌నీనోపై చైతన్యం కల్పించాలని ఆదేశించారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటల ఎంపికపై రైతులకు మార్గదర్శకాలు ఇవ్వాలని.. ప్రతీ రైతుకు వ్యవసాయ శాఖ ద్వారా సాంకేతిక సలహాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సాగునీటి వినియోగాన్ని శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు. సాగుకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి జిల్లాలోనూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని.. రైతు సంక్షేమమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని వెల్లడించారు. వదంతులను నమ్మవద్దని.. అధికారుల సూచనలనే పాటించాలని కోరారు. ఎల్‌నీనో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధమని స్పష్టం చేశారు.






