వ్యవసాయానికి కొండంత భరోసా.. దేవాదుల ప్రాధాన్యత పై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

by Jakkula.Mamatha |

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు.

వ్యవసాయానికి కొండంత భరోసా.. దేవాదుల ప్రాధాన్యత పై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
X

దిశ,ధర్మసాగర్: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో కలిసి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం గోదావరి నుండి ఎన్ని పంపులు నడుస్తున్నాయి, ఇంకా పంపింగ్ చేయాల్సిన మోటార్లు ఎన్ని, పంపింగ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే విషయాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లా వరప్రదాయినిగా మారిందని తెలిపారు.

2003లో ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నేను నాటిన చిన్న మొక్క నేడు మహా వృక్షంగా ఎదిగి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు, త్రాగు నీరు అందిస్తోందని కొనియాడారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రారంభించిన నాటి నుంచి పూర్తి అయ్యే వరకు ప్రత్యక్ష రాజకీయాలలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తి కలిగించింది కూడా దేవాదుల పథకమే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని ఒకవేళ వారి సాగు చేయాల్సి వస్తే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులు అర్ధం చేసుకొని రైతులు సహకరించాలని కోరారు.

15 రోజుల్లో కాలువల ద్వారా నీరు విడుదల చేస్తాం..

దేవాదుల ఎత్తిపోతల పథకం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని దేవాదుల పంపింగ్ ను నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. నేటి నుంచి నెల రోజుల పాటు నిరంతరాయంగా దేవాదుల లోని అన్ని ఫెజ్‌ల ద్వారా పంపింగ్ జరుగుతుందని అన్నారు. ఈ నెల రోజుల్లో ధర్మసాగర్, స్టేషన్ ఘనపూర్, నవాబ్ పేట, అశ్వరావుపల్లి, చిటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లు నింపే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

రైతులు పంట సాగు చేసుకోవడానికి 15 రోజులలో కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పంపింగ్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 3లక్షల ఎకరాలకు సాగు నీరు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి, నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story