- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ్ల పైసల కోసం రైతన్నల రణభేరి
జిల్లాలో వెలుగుచూసిన ధాన్యం కుంభకోణం ప్రభావం రైతులపై తీవ్రంగా పడుతోంది.

దిశ, కోనరావుపేట : జిల్లాలో వెలుగుచూసిన ధాన్యం కుంభకోణం ప్రభావం రైతులపై తీవ్రంగా పడుతోంది. ధాన్యం విక్రయించి రెండు నెలలు గడిచినా ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామానికి చెందిన రైతులు బుధవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించినప్పటికీ, నెలలు గడుస్తున్నా చెల్లింపులు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి అక్రమాల కారణంగా నిజాయితీగా పంట పండించిన రైతులే నష్టపోతున్నారని ఆరోపించారు. సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోతుండగా, మరోవైపు కొత్త పంట నాట్ల సమయం దగ్గరపడుతున్నా పెట్టుబడికి అవసరమైన నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. వడ్లకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు చేపట్టిన రాస్తారోకోతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న కోనరావుపేట పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను త్వరితగతిన విడుదల చేసేలా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ నిరసనను విరమించారు. అయితే ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో చెల్లింపులు అందకపోవడంతో అప్పుల భారం, సాగు పెట్టుబడుల కొరత మధ్య అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రైతుల బకాయిలను వెంటనే విడుదల చేసి వారి ఇబ్బందులను తొలగించాలని స్థానికులు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.






