- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పలకరించని తొలకరి.. చినుకు జాడ కోసం అన్నదాతల ఎదురు చూపు!
వానాకాలం మొదలై 20 రోజులు అవుతున్నా చినుకు జాడ లేదు.

దిశ, వరంగల్ బ్యూరో: వానాకాలం మొదలై 20 రోజులు అవుతున్నా చినుకు జాడ లేదు. నేల తడిసింది లేదు. వానాకాలం సాగు కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకున్న రైతులు భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. పునాస మొదలై నెలాఖరుకు వస్తున్నా నేల తడవక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మొక్కజొన్న, వరి భారీగా సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కాలువలు, ప్రాజెక్టుల పారకం తక్కువగా ఉన్న ఉమ్మడి జిల్లాలో వర్షాల కోసమే మెజార్టీ రైతులు ఎదురు చూస్తున్నారు. బావుల కింద కొన్నిచోట్ల విత్తనాలు వేసినా మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయ శాఖ అంచనాలు..
వానాకాలం జూన్ 1వ తేదీ నుంచే ఆరంభం కావడంతో సాగు కోసం రైతులు సిద్ధమయ్యారు. ఆరు జిల్లాల పరిధిలోని వ్యవసాయ శాఖ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ను కు అనుగుణంగా పంటలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏయే జిల్లాలో ఎంత మొత్తంలో వానాకాలం పంటలు వేస్తారో వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 16 లక్షల 62వేల 172 ఎకరాల్లో ఈ వానాకాలంలో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. హన్మకొండ జిల్లాలో 2లక్షల 42వేల 375 ఎకరాలు, వరంగల్ 2లక్షల 37వేల 957 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 4లక్షల 77వేల 765 ఎకరాలు, ములుగులో లక్షా 27వేల 620 ఎకరాలు, భూపాలపల్లిలో 2లక్షల 12వేల 121 ఎకరం, జనగామలో 3లక్షల 64వేల 334 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేశారు.
ప్రతి యేడు వానాకాలం ఆరంభంలోనే నైరుతి రుతుపవనాలతో తొలకరి జల్లులు కురిసేవి. మొదటి వారం లేదా రెండో వారంలో వర్షం పడేది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ వర్షం నమోదు కాలేదు. తొలకరి వర్షం భారీగా పడలేదు. కొన్ని జిల్లాల పరిధిలో తేలికపాటి జల్లులు మాత్రమే కురిశాయి. ఈనెల పడాల్సిన వర్షం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లాలో 77.1 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 15.6 మిల్లీమీటర్లు పడింది. వరంగల్ లో 81.0 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 35.9 మిల్లీమీటర్లు, ములుగులో 94.7 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 62.1 మిల్లీమీటర్లు, మహబూబాబాద్ లో 79.6 పడాల్సి ఉండగా 31.6, భూపాలపల్లిలో 84.3 పడాల్సి ఉండగా 40.7, జనగామ జిల్లాలో 70.7 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 32.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఏ జిల్లాలోనూ సగటు వర్షపాతం నమోదు కాలేదు. జూన్ ఆరంభంలోనే నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల పరిధిలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేవి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రభావం బలంగా లేకపోవడంతో అనుకున్న విధంగా వర్షాలు పడలేదు.
వరి, పత్తి,మొక్కజొన్న వైపే మొగ్గు..
ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలంలో రైతులు ఎక్కువగా పత్తి, వరి, మొక్కజొన్న సాగుకే మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 5 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 5 లక్షల ఎకరాల వరకు వరి, 3 లక్షల ఎకరాల వరకు మొక్కజొన్న సాగవుతుందని అంచనాకు వస్తున్నారు. ఈ మూడు పంటలు అత్యధికంగా సాగు చేసేందుకు రైతులు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇవే కాకుండా కంది, పెసర, పసుపు, మిర్చి సాగుకు కూడా సిద్ధమవుతున్నారు. కొద్ది మొత్తంలో ఇతర పంటల సాగు కూడా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మే నెల వరకు యాసంగి ధాన్యం అమ్ముకునేందుకు తిప్పలు పడ్డ రైతులు ప్రస్తుతం సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారీ వర్షాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకున్న రైతులు భారీ వర్షం పడితే పెద్ద ఎత్తున పంటల సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతేడాది పత్తికి డిమాండ్ ఉండటంతో ఈ సారి కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సన్నాల సాగుకు సన్నద్ధం..
ప్రభుత్వం వరి సాగు చేసే రైతులకు సన్నాలు పండిస్తే బోనస్ ఇస్తామని ప్రకటించడంతో ఎక్కువ మంది ఆ పంట వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరిలో ఎక్కువగా ఏడు రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆ విత్తనాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వరి వేసే రైతులు దొడ్డు రకాలను వదిలిపెట్టి బోనస్ వచ్చే బీపీటీ, తెలంగాణ సోనా, జైశ్రీరాం, హెచ్ఎంటీ, వరంగల్ 962, వరంగల్ 44, జేజీఎల్ 1798 రకాలను సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఏడాది భారీ వర్షాలు పడటం భూగర్భ జలాలు అత్యధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు వరి సాగు వానాకాలం, యాసంగిలో చేపట్టారు. అదే రీతిలో కొంత ఆలస్యమైనా భారీ వర్షాలు పడతాయని అంచనాకు వచ్చిన రైతులు వరి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
బావులు ఉన్న కోట నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. గత రెండు సీజన్ లో సాగు పెరగడంతో అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరుతడి పంటలు ఎక్కువగా సాగు చేయాలని కోరుతున్నారు. వానాకాలం మొదలై 20 రోజులైనా భారీ వర్షాలు పడకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. భూగర్భ జలాలు కూడా తక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో వర్షాలు పడిన తర్వాతనే పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తుండడం, భారీగా ఉష్ణోగ్రతలు ఉండటంతో ఆందోళనలు చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు బలంగా వీచి వర్షాలు మొదలైతే తప్ప రైతులు పంటలు జోరుగా సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో పంటల సాగు భారీ వర్షాలు పడిన తర్వాతనే చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం భూమిలో వేడి ఉండటంతో వేసిన విత్తనాలు ఎండిపోవడం జరుగుతుందని బావిలో ఉన్న నీళ్లను పెట్టిన మొలకెత్తే పరిస్థితి ఉండదని పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర ఆరుతడి పంటలను వేసే రైతులు తప్పనిసరిగా సమయం తీసుకొని వర్షాలు పడిన తర్వాతనే సాగు చేయాలని కోరుతున్నారు.






