- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ స్కానింగ్‌లపై కొరడా..?
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న పీసీపీఎన్డీటీ చట్టం ఆదిలాబాద్ జిల్లాలో ఎంతవరకు సమర్థవంతంగా అమలవుతోందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, ఆదిలాబాద్: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న పీసీపీఎన్డీటీ చట్టం ఆదిలాబాద్ జిల్లాలో ఎంతవరకు సమర్థవంతంగా అమలవుతోందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం ‘దిశ’ దినపత్రికలో వచ్చిన లింగ నిర్ధారణ కథనంపై అధికార వర్గాల్లో కదలిక మొదలైంది. జిల్లాలో అనుమతులు లేని స్కానింగ్ కేంద్రాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పరీక్షలపై గతంలోనూ పలుమార్లు ఆరోపణలు వెలుగుచూశాయి. తప్పుడు రిపోర్టులు, అక్రమ స్కానింగ్లు, స్కానింగ్ సెంటర్లలో దోపిడీ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ,బాధ్యులపై ఆశించిన స్థాయిలో కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమాలను అరికట్టాల్సిన అధికార యంత్రాంగమే కొందరు ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని ప్రజా సంఘాలు అంటున్నాయి. ముఖ్యంగా ఫిర్యాదు వెళ్లిన తర్వాత కూడా సంబంధిత కేంద్రాలపై కఠిన చర్యలు లేకపోవడం, విచారణలు ముందుకు సాగకపోవడం, సమాచారం లీకవుతోందన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పుష్కర్ హాస్పిటల్ పై డీఎంహెచ్వో దాడులు..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ లో ఉన్న పుష్కర్ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ యంత్రాన్ని అధికారులు సీజ్ చేయడం కలకలం రేపింది. నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే యంత్రం సీజ్ చేసినప్పటికీ.. కేవలం యంత్రాన్ని స్వాధీనం చేసుకోవడానికే పరిమితమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పి సి పి ఎన్ డి టి చట్టం ప్రకారం అనుమతి లేకుండా స్కానింగ్ యంత్రాన్ని నిర్వహించడం స్కానింగ్ చేసిన ఆసుపత్రిని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులు వైద్యురాలిపై కేసులు నమోదు చేయాల్సి ఉంది. జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఉదాహరణగా నిలిచే విధంగా కఠిన చర్యలు తీసుకుంటేనే పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిర్యాదులు వచ్చినా..
జిల్లాలో అనుమతులు లేని స్కానింగ్ కేంద్రాలు,కొందరు గైనకాలజిస్టుల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తున్నప్పటికీ వాటిపై కఠిన చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై ఆరోపణలు వచ్చినా తనిఖీలు, కేసులు, లైసెన్స్ రద్దులు వంటి చర్యలు పెద్దగా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో ఫిర్యాదులు కేవలం ఫైళ్లకే పరిమితమవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. జిల్లాలోని పలు స్కానింగ్ కేంద్రాలపై గతంలో తప్పుడు రిపోర్టులు ఇచ్చారన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని కొన్ని కేంద్రాల్లో పరీక్షల ఫలితాల విషయంలో వివాదాలు తలెత్తిన ఘటనలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ సంబంధిత కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో స్కానింగ్ కేంద్రాల పనితీరు పై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సమాచారం లీకవుతోందా..?
అక్రమ స్కానింగ్‌లపై ఫిర్యాదులు వెళ్లిన వెంటనే సంబంధిత ఆస్పత్రులకు సమాచారం చేరుతుందన్న ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తనిఖీలకు వెళ్లేలోపే ఆస్పత్రి యాజమాన్యాలు అప్రమత్తమై ఆధారాలు లేకుండా చేస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది.జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి చేరుతున్న ఫిర్యాదులు గోప్యంగా ఉండాల్సి ఉండగా, అవి బయటకు ఎలా వెళ్తున్నాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు,ప్రైవేట్ ఆస్పత్రుల మధ్య కుమ్మక్కు ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిపై ఫిర్యాదు వెళ్లిన తర్వాత అక్కడి యాజమాన్యం ముందుగానే అప్రమత్తమైన ఘటనలపై కూడా చర్చ జరుగుతోంది. ఫిర్యాదు అందిన వెంటనే తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు ఆలస్యం చేయడం,చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. నిజంగానే సమాచారం లీకవుతుందా? లేక ఇది కేవలం ఆరోపణలేనా? అనే అంశంపై ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఫిర్యాదుదారుల వివరాలు సైతం గోప్యంగా ఉండటం లేదన్న వాదనలు వినిపిస్తుండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
చట్టం కాగితాలకే పరిమితమా..?
పీసీపీఎన్డీటీ చట్టం లక్ష్యం గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను పూర్తిగా అరికట్టడం.అయితే జిల్లాలో పరిస్థితులు చూస్తే చట్టం అమలు కేవలం సమీక్ష సమావేశాలు,అధికారిక నివేదికలకే పరిమితమైందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేని స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక డ్రైవ్‌లు, ఆకస్మిక తనిఖీలు,కఠిన చర్యలు కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ అధికారులు మౌనం వీడకపోవడం చర్చనీయాంశమైంది.తాజాగా ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్‌లో గల పుష్కర్ ప్రైవేట్ ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నట్లు గుర్తించిన స్కానింగ్ యంత్రాన్ని డీఎంహెచ్‌వో అధికారులు సీజ్ చేశారు. అయితే కేవలం యంత్రాన్ని సీజ్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా,ఆ దిశగా ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఇతర స్కానింగ్ కేంద్రాలపై కూడా సమగ్ర తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు,మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: డాక్టర్ సాధన, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్
జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాం అనుమతులు లేకుండా స్కానింగ్ సేవలు నిర్వహించే కేంద్రాలు, నిబంధనలను ఉల్లంఘించే ఆస్పత్రులపై నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయి.చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో తెలిపారు.






