- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాలతో రైతుల్లో ఫుల్ జోష్..
ఇటీవల కురిసిన వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి.

దిశ, కాటారం : ఇటీవల కురిసిన వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. గత కొన్నేళ్లుగా వర్షాభావం, పంటల నష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈసారి ప్రకృతి అనుకూలించడంతో కోటి ఆశలతో దుక్కులు ప్రారంభించారు. ఖరీఫ్ సాగుకు అనుకూల వాతావరణం నెలకొనడంతో కాటారం మండల వ్యాప్తంగా రైతులు పొలాల్లో వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. ఎక్కడ చూసినా ట్రాక్టర్లతో దుక్కులు దున్నుతూ, విత్తనాలు, ఎరువుల సేకరణ, సాగు ఏర్పాట్లలో రైతులు నిమగ్నమయ్యారు. ఈ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు, వాగులు కొంత మేర నీటితో నిండాయి.
దీంతో భూగర్భ జల మట్టం కూడా మెరుగు పడుతుండటంతో రైతులు ధైర్యంగా వ్యవసాయ సాగుపనులు ప్రారంభించారు. పొలాలను దున్నడం, విత్తనాల ఎంపిక, ఎరువుల కొనుగోలు, నాట్ల ఏర్పాట్లు వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. కుటుంబ సభ్యు లు కూడా వ్యవసాయ పనుల్లో పాల్గొంటూ రైతులకు అండగా నిలుస్తున్నారు. మండల కేంద్రంలో విత్తన మరియు ఎరువుల కొనుగోలు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాల రాకపోకలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఏడాది తాము విత్తిన విత్తనాలు సమృద్ధిగా మొలకెత్తి పచ్చని పైరులతో పొలాలు కళకళలాడాలని రైతులు ఆశిస్తున్నారు. ఈసారి వర్షాలు అనుకూలంగా కొనసాగితే ఖరీఫ్ పంటలు మంచి దిగుబడులు ఇస్తాయని వారు ఆసిస్తున్నారు. ప్రకృతి కరుణిస్తే ఈ ఏడాది వ్యవసాయం లాభదాయకంగా మారుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత పంట పెట్టుబడులు తిరిగి రాక అప్పుల భారం..
గత రెండు సంవత్సరాలుగా పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట సాగుకు చేసిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల భారం పెరిగింది. ఈ ఏడాది వర్షాలు అనుకూలంగా ఉండటంతో పాటు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను సమర్థవంతంగా అమలు చేసి, మార్కెట్లో పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలని రైతులు కోరుతున్నారు. దిగుబడులు బాగా వచ్చినా ధరలు లేకపోతే రైతులకు ప్రయోజనం ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు బాగా పండితే..
ఈ ఖరీఫ్ సీజన్లో సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండితే గత నష్టాల నుంచి బయటపడగలమనే నమ్మకం రైతుల్లో కనిపిస్తోంది. కాటారం వ్యవసాయ అధికారిని పూర్ణిమ కూడా రైతులకు అవసరమైన సూచనలు అందిస్తూ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వినియోగించాలని సూచిస్తున్నారు. సరైన సమయంలో వర్షాలు కురిస్తే వరి, పత్తి, మిర్చి, తదితర పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న వ్యవసాయ కదలికలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రకృతి సహకరించి, ప్రభుత్వం కూడా రైతులకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తే ఈ ఖరీఫ్ సీజన్ రైతులకు మంచి ఫలితాలను అందిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






