కాడెడ్లతో రైతు నిరసన

by Ratna Kumari |

5 ఏళ్లుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తన సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందిన ఓ రైతు, వ్యవసాయ పనులకు ఉపయోగించే కాడెడ్లు, నాగలితో నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన చేపట్టడంతో ఈ ఘటన మండల వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కాడెడ్లతో రైతు నిరసన
X

దిశ, యాచారం : 15 ఏళ్లుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తన సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందిన ఓ రైతు, వ్యవసాయ పనులకు ఉపయోగించే కాడెడ్లు, నాగలితో నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన చేపట్టడంతో ఈ ఘటన మండల వ్యాప్తంగా సంచలనంగా మారింది. మండల పరిధిలోని మొగుళ్లవంపు గ్రామానికి చెందిన బత్తెనగారి పాండురంగారెడ్డి తన అన్నదమ్ములతో కలిసి సర్వే నంబర్ 98లో మొత్తం 16 ఎకరాల 20 గుంటల భూమి కలిగి ఉన్నారు. ఇందులో 1985లో 8 ఎకరాలు, 1993లో మరో 4 ఎకరాలు విక్రయించగా, మిగిలిన 4 ఎకరాల 20 గుంటల భూమిలో తన వాటాగా రావాల్సిన 3 ఎకరాలకు పట్టా పాస్‌బుక్ మంజూరు చేసి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని గత 15 ఏళ్లుగా అధికారులను కోరుతున్నట్లు తెలిపారు.

అయితే, ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదని, సమస్యను పరిష్కరించకపోవడంతో విసిగి వేసారిపోయి కాడెడ్లతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగినట్లు రైతు తెలిపారు. గ్రామానికి వచ్చి పూర్తి వివరాలు సేకరించి తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, భూమి సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కూడా తనకు అందడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో అయ్యప్ప వెంటనే స్పందించి, రైతు పూర్తి వివరాలతో ఫిర్యాదు అందజేస్తే సంబంధిత భూమి రికార్డులను పరిశీలించి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతు తన ఆందోళనను విరమించగా, అక్కడ ఉన్న అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story