సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు నేరమే

by Malleboina Mahesh |

సోషల్ మీడియాలో మహిళలు తమపై జరుగుతున్న వేధింపులను అసలు భరించవద్దు. స్వేచ్ఛ పేరుతో ఇతరుల హక్కులను దెబ్బతీస్తే శిక్షలు తప్పవని పోలీసుల హెచ్చరిక.

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు నేరమే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఇది నా సోషల్ మీడియా అకౌంట్.. నా ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెడతా.. నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది.’ అంటూ ఇతరులను వేధించే వారికి, మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే ఆకతాయిలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వేచ్ఛ పేరుతో అవతలి వ్యక్తుల హక్కులను దెబ్బతీస్తే ఇకపై తప్పించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం ద్వారా నేరస్తులకు కఠినశిక్షలు పడేలా నిబంధనలు రూపొందించారు. హద్దు మీరితే నేరుగా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని, ముఖ్యంగా ఆన్‌లైన్ వేధింపుల పట్ల ఉక్కుపాదం మోపుతామని పోలీసులు తేల్చిచెబుతున్నారు.

స్వేచ్ఛ పేరు హద్దు మీరితే..

కొందరు భావప్రకటన స్వేచ్ఛ పేరుతో సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇతరుల భద్రతకు, ప్రైవసీకి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు. గతంలో ఉన్న ఐపీసీ స్థానంలో వచ్చిన బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు ఇప్పుడు మరింత పటిష్టంగా మారాయి. ఒక వ్యక్తికి ఇష్టం లేకపోయినా వారిని వెంబడించడం, పదేపదే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లతో విసిగించడం, సోషల్ మీడియాలో వారి ప్రొఫైళ్లను నిరంతరం గమనిస్తూ నిఘా వేయడం వంటి పనులను బీఎన్ఎస్ సెక్షన్ 78 స్టాకింగ్.. కింద తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మొదటిసారి ఇలాంటి నేరానికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రెండోసారి దొరికితే ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది.

ఇది నాన్ బెయిలబుల్ నేరం కావడంతో నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలను ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలం వాడటం, డబుల్ మీనింగ్ డైలాగులతో కామెంట్ చేయడం, తప్పుడు ఫొటోలు లేదా వీడియోలు పంపడం వంటి చర్యలను బీఎన్ఎస్ సెక్షన్ 79 కింద బుక్ చేస్తారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఏ చిన్న మాట లేదా సైగ చేసినా అది నేరమే అవుతుంది. ఇంటర్ నెట్‌లో బాధితుల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం వంటి చర్యలకు ఐటీ యాక్ట్ సెక్షన్లు కూడా తోడవుతాయి.

వేధింపులా.. ఫిర్యాదు చేయండి

సోషల్ మీడియాలో మహిళలు తమపై జరుగుతున్న వేధింపులను అసలు భరించవద్దు. స్వేచ్ఛ పేరుతో ఇతరుల హక్కులను దెబ్బతీస్తే శిక్షలు తప్పవు. ముఖ్యంగా మహిళలు భయం వీడి తక్షణమే డయల్ 112 లేదా మహిళా హెల్ప్‌లైన్ 181కు ఫిర్యాదు చేయాలి. బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. నేరస్తుల ఆటకట్టించడంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి.- చారుసిన్హా, అదనపుడీజీ, మహిళా భద్రత, షీ టీమ్స్ భరోసా

Next Story