- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సింగరేణి’ ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే కట్టుకథలు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రానికి ఆత్మగా ఉన్న సింగరేణిపై వస్తున్న కొన్ని కట్టుకథలు, రాతలు అంతిమంగా 42 వేల మంది పర్మినెంట్, 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి ఆత్మగా ఉన్న సింగరేణిపై వస్తున్న కొన్ని కట్టుకథలు, రాతలు అంతిమంగా 42 వేల మంది పర్మినెంట్, 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ప్రజా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడుల పేరుతో ఒక పత్రిక రాసిన విషపు కథనంతో వివాదం మొదలైందని తెలిపారు. కట్టుకథలు, ఊహాగానాలతో రోజుకో కథ వండివారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ వార్తలను చూస్తుంటే.. ఎవరో దోపిడీదారు కోసమో లేదా ఎవరి ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నాయని అనిపిస్తోందని అన్నారు.
‘సింగరేణి’ అటానమస్ సంస్థ అని గుర్తిస్తే బెటర్..
కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకే సింగరేణిలో ‘సైట్ విజిట్’ అనే నిబంధన పెట్టారని ఊహించుకుని కథనాలు రాశారని ఆయన మండిపడ్డారు. అనుకున్న వ్యక్తులకు టెండర్లు ఇచ్చేందుకు నిబంధనలు మార్చారంటూ పక్కాగా కథలు అల్లారని చెప్పారు. సైట్ విజిట్ అనేది ఏదో తనకే మేలు జరిగేందుకే పెట్టారని కథనాలు రాయడాన్ని ఆయన ఆక్షేపించారు. సింగరేణి అనేది ఒక అటానమస్, ఇండిపెండెంట్ సంస్థ అని గుర్తు చేశారు. గత 105 ఏళ్లుగా సింగరేణి బోర్డు కొనసాగుతోందని, అసలు సింగరేణి నిర్ణయాలు మంత్రి దగ్గరకు రానే రావని స్పష్టం చేశారు. అయినా, ఆరోపణలు వచ్చిన మరుక్షణమే టెండర్లు రద్దు చేయాలని ఆదేశించానని భట్టి విక్రమార్క అన్నారు.
సైట్ విజిట్ నిబంధనపై దుష్ప్రచారం..
ఇక సింగరేణి టెండర్ల విషయంలో హరీశ్ రావు లేఖ రాయడం, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎంక్వైరీకి ఆదేశించడం మంచి పరిణామమేనని భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయంలో కిషన్ రెడ్డి నిర్ణయాన్ని తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. సైట్ విజిట్ అనేది ఎక్కడా లేని నిబంధన అన్నట్లుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారని, కానీ కోల్ ఇండియా 2018లోనే టెండర్ డాక్యుమెంట్లు పంపిందని భట్టి గుర్తు చేశారు. సైట్ విజిట్ తప్పనిసరి అని CMPDI డాక్యుమెంట్‌లోనే ఉందని మీడియా ప్రతినిధులకు మార్క్ చేసి చూపించారు. 2021లోనూ కోల్ ఇండియా మరో డాక్యుమెంట్ పంపిందని, కానీ ఆ సమయంలో తమ ప్రభుత్వం అధికారంలో లేదని చెప్పారు. గతంలో గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ టెండర్లలో, రైల్వేస్‌కు చెందిన ‘రైట్స్’ టెండర్లలో, హిందుస్థాన్ కాపర్స్ సంస్థ టెండర్లలో సైట్ విజిట్ నిబంధన ఉందని తెలిపారు. చివరగా నవరత్న కంపెనీ రీసెంట్‌గా ఇచ్చిన టెండర్లలోనూ సైట్ విజిట్ ఉందో లేదో తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. కేంద్రం ఆధీనంలోని NMDC కూడా 2021లో బిడ్డర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలని నిబంధన పెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
అందుకే టెండర్లను రద్దు చేయాలని చెప్పా...
దేశంలోని చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సైట్ విజిట్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నాయని, తాము చేస్తే తప్పేముందని భట్టి విక్రమార్క నిలదీశారు. కానీ సైట్ విజిట్ అనే నిబంధన దేశంలో ఎక్కడా లేనట్లుగా దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్లు రద్దు చేయకపోతే ప్రజల్లో అపోహలు పెరుగుతాయని భావించి వెంటనే రద్దు చేయాలని చెప్పానని, ఆరోపణలు చేసిన వారు ఇప్పటికైనా తప్పు గ్రహించి తమ వ్యాఖ్యలను సరిచేసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.






