- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతా కల్తీమయం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!
జగిత్యాల పట్టణంలో బ్రాండ్ ఇమేజ్‌తో పాటు నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తారని పేరు ఉన్న ‘పిక్ అప్ పాయింట్’ బేకరీలో స్వీట్ బ్రెడ్ లో ఈగ వచ్చిందని ఓ వ్యక్తి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలో బ్రాండ్ ఇమేజ్‌తో పాటు నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తారని పేరు ఉన్న ‘పిక్ అప్ పాయింట్’ బేకరీలో స్వీట్ బ్రెడ్ లో ఈగ వచ్చిందని ఓ వ్యక్తి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మంగళవారం బేకరీలో తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఈగలు,దోమలు వంటివి రాకుండా ఫ్లై కేర్ మరింత మెరుగు పరచాలని సూచించడంతో పాటు లేబులింగ్ లేని ప్యాక్ చేసిన ఫుడ్ మెటీరియల్ ని సీజ్ చేశారు. అనంతరం సంబంధిత యజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు మీడియాకు వివరించారు. నాణ్యమైన ఆహార పదార్థాలకు మారుపేరుగా ఉన్న ఈ బేకరీలో ఇలాంటి ఘటన వెలుగు చూడటం వినియోగదారులను ఆందోళనకు గురి చేసింది.
వినియోగదారుల ఆందోళన..
జగిత్యాల జిల్లాలో ఆహార భద్రతపై వినియోగదారులలో ఆందోళన వ్యక్తమవుతోంది. నాణ్యత, పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచిన ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లోనే ఇటీవల ఆహార పదార్థాల్లో ఈగలు, బొద్దింకలు, బల్లులు వంటివి వచ్చిన అవాంఛనీయ ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. బ్రాండ్ ఇమేజ్‌కు తగిన విధంగా పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే పరిస్థితుల్లో ప్రజలు తినే ప్రతి ఆహార పదార్థం సురక్షితంగా ఉండాలన్న డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది.
తనిఖీలు నామమాత్రమే..
జిల్లాలో ఫుడ్ సేఫ్టీ విభాగంలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది లేకపోవడం ఆహార నాణ్యత పర్యవేక్షణ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉన్న అధికారులకు ఇతర జిల్లాల అదనపు బాధ్యతలు అప్పగించడంతో తనిఖీలు కూడా నామమాత్రంగా మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు స్పందించడం తప్ప, ముందస్తు తనిఖీలు, ఆకస్మిక దాడులు చాలా అరుదుగా జరుగుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం వెంటనే ఖాళీలను భర్తీ చేసి నిరంతర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మున్సిపల్ పర్యవేక్షణ పైన విమర్శలు..
హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో పరిశుభ్రత, సానిటేషన్‌ను తనిఖీ చేసే అధికారాలు మున్సిపల్ యంత్రాంగానికి ఉన్నప్పటికీ, అవి సమర్థవంతంగా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో వందలాది ఆహార విక్రయ కేంద్రాలు ఉన్నప్పటికీ, వినియోగదారుల ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే చర్యలు కనిపిస్తున్నాయే తప్ప, సాధారణ తనిఖీలు కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు కొద్ది రోజుల హడావుడి తర్వాత పరిస్థితి మళ్లీ యథాతథంగా మారుతోందని ప్రజలు అంటున్నారు. వర్షాకాలంలో తాగే నీటి నుంచి తినే ఆహారం వరకు కల్తీ, అపరిశుభ్రత లేకుండా కఠినంగా పర్యవేక్షించాలని, జిల్లాలో ఆహార భద్రతపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దారుణంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీల నిర్వహణ..
జగిత్యాల జిల్లాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ముఖ్యంగా ఆయా పట్టణాల్లో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. నాళాల పక్కనే ఏర్పాటు చేసిన కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడే చికెన్ రోజుల తరబడి నిల్వచేసి వాసన రాకుండా వెనిగర్ తో పాటు ఇతర రసాయనాలు కలుపుతారనేది బహిరంగ రహస్యమే. మరోవైపు అత్యంత భయంకరమైన నిషేధిత ఆరెంజ్ ఫుడ్ కలర్స్ తో పాటు ఏమాత్రం నాణ్యత లేని సాస్ లను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మరిగించిన వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు సమాచారం. ఇక బేకరీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి నిలువ ఉంచిన నాణ్యతలేని ఫుడ్ ఐటమ్స్ ని కేకులు, పేస్ట్రీలు, పఫ్ లు, బ్రెడ్ ఇతరత్రా ఐటమ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు.






