- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)ను మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)ను మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 27 యూఎల్బీలను విలీనం చేయడంతోపాటు జీహెచ్ఎంసీని 300 వార్డులుగా చేశారు. త్వరలోనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించనున్నారు. ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్‌ను అధికారులు సిద్ధం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగిసిన వెంటనే మూడు కార్పొరేషన్లకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
అన్ని ఒకే విధంగా..
మూడు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు మూడు పోలీసు కమిషనరేట్లు, రెవెన్యూ జిల్లాలను సైతం మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. జీహెచ్ఎంసీ పరిధిని ఇప్పటికే మూడు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. ఇక మిగిలింది మూడు జిల్లాలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల అంశమే. పాత హైదరాబాద్ రెవెన్యూ జిల్లాతో పాటు శంషాబాద్ వరకు విస్తరించిన 150 మున్సిపల్ వార్డుల జీహెచ్ఎంసీ పరిధిని అలాగే కొనసాగిస్తూ, మిగిలిన పరిధిని గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తి కావడంతో కొత్తగా ఏర్పాటు కానున్న రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు జీహెచ్ఎంసీ తరహాలో వార్డు, సర్కిల్, జోన్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
న్యాక్‌లో జీసీఎంసీ ఆఫీసు
టీసీయూఆర్ పరిధిలో మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాల ని నిర్ణయించిన ప్రభుత్వం వాటికి ఆఫీసుల ను సైతం గుర్తించింది. మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్(ఎన్ఏసీ) భవనంలో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసును ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇక విలీన పట్టణ స్థానిక సంస్థలకు విలీనానికి ముందున్న చిన్న చిన్న ఆఫీసులను సర్కిల్, వార్డు ఆఫీసులుగా వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
కార్యాలయ ఆవరణను బట్టి సర్కిల్ గానీ, వార్డు ఆఫీసులుగా ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం. వాటికి కావాల్సిన ఫర్నిచర్, కంప్యూటర్లు వంటివి సమకూర్చే పనిలో అధికారులు తలమునకలై ఉన్నట్లు తెలిసింది. విలీనమైన బండ్లగూడ జాగీరు వంటి పట్టణ స్థానిక సంస్థలోని ఆఫీస్ భవనాల్లో వివిధ విభాగాల వారీగా ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నారు. మాదాపూర్ ఎన్ఏఏసీలో మామూలు గదులుగా కాకుండా పెద్ద పెద్ద హాల్ వంటివి అందుబాటులో ఉన్నందున, ప్రస్తుతానికి విభాగాల వారీగా పార్టీషన్ క్యాబిన్‌లను ఏర్పాటు చేసి పౌర సేవల నిర్వహణ, పరిపాలన వ్యవహారాలు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు.
తార్నాక హుడా భవనంలో జీహెంఎంసీ ఆఫీస్
తార్నాకలోని పాత హెచ్ఎండీఏ ఆఫీసులో గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంఎంసీ) ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌తో పాటు అదనపు కమిషనర్ల చాంబర్ల తరహాలో ఇక్కడ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఆఫీస్ ఏర్పాటు పనులను పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఇప్పటికే నియమించిన అదనపు కమిషనర్, టౌన్ ప్లానింగ్ చీఫ్ సిటీ ప్లానర్, అదనపు కమిషనర్ (ఫైనాన్స్) వంటి అధికారులు అక్కడే విధులు నిర్వర్తించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.






