భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

by Ratna Kumari |   (  Updated:2026-07-03 12:35:17  IST  )

భావితరాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పిలుపునిచ్చారు.

భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
X

దిశ, సత్తుపల్లి : భావితరాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి జేవీఆర్ కళాశాల మైదానంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం జేవీఆర్ కళాశాల నుంచి పాత సెంటర్ వరకు నిర్వహించిన భారీ వనమహోత్సవ ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, జానపద కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవం అంటే కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదని, దానిని ఒక సామాజిక ఉద్యమంగా, పండుగగా నిర్వహించాలని అన్నారు. దీపావళి, దసరా, సంక్రాంతి వంటి పండుగలను ఎలా జరుపుకుంటామో, అదే ఉత్సాహంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని సూచించారు.

చక్రవర్తి అశోకుడికి ఓ వృద్ధుడు చెప్పిన "భావితరాల కోసం మొక్కలు నాటుతున్నాను" అనే సందేశాన్ని గుర్తు చేస్తూ, భావితరాలకు పచ్చని భూమిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమం ద్వారా ప్రతి ఏడాది కోట్లాది మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోందని, ప్రకృతిని పరిరక్షించడం ద్వారానే ఈ సవాళ్లను ఎదుర్కోగలమన్నారు. చెట్లు, పక్షులు, నేల, నీటి వనరులు, జీవ వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా మాత్రమే భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు. వనమహోత్సవం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, భావితరాల భవిష్యత్తును కాపాడే సామాజిక ఉద్యమమని పేర్కొన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల తగ్గుదల వంటి సమస్యలకు మొక్కల పెంపకమే శాశ్వత పరిష్కారమని చెప్పారు.

ప్రతి పౌరుడు తన ఇంటి వద్ద, విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. నేడు నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు అమూల్యమైన ఆస్తి అని, ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనలను కాపాడుతుందని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం విద్య, అభివృద్ధి, సామాజిక చైతన్యంలో ముందంజలో ఉందని, ఈ భారీ వనమహోత్సవ ర్యాలీ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా అటవీ అధికారి అనూజ్ అగర్వాల్, ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి మట్టా దయానంద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story