- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకే చేరాలి
జిల్లాలో అభివృద్ధి పథకాల అమలును మరింత సమర్థవంతంగా చేపట్టి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.

దిశ, ప్రతినిధి నిర్మల్ : జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలును మరింత సమర్థవంతంగా చేపట్టి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ గోడం నగేశ్ అధ్యక్షతన నిర్వహించగా, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్‌పర్సన్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో గత ఏడాది కాలంగా వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ పనులు, భౌతిక, ఆర్థిక పురోగతిపై శాఖల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు, ఈజీఎస్, మెటీరియల్ వర్క్స్, 'ఏరువాక–మన ఊరు మన చేను' కార్యక్రమం, బ్యాంకు లింకేజీ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వ్యవసాయ శాఖ ద్వారా పీఎంకేఎస్‌వై అమలు, యూరియా నిల్వలు, విద్యుత్ శాఖ మౌలిక సదుపాయాలు, వైద్య ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్, విద్యాశాఖ సర్వ శిక్ష అభియాన్, పీఎం శ్రీ, మధ్యాహ్న భోజన పథకం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్, ఉద్యానవన, అటవీ, గిరిజన సంక్షేమ, క్రీడలు, పౌర సరఫరాలు, బీఎస్ఎన్ఎల్, నేషనల్ హైవే, లీడ్ బ్యాంక్ తదితర శాఖల పనితీరును సమీక్షించారు.
పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి శాఖ పనితీరును విడివిడిగా సమీక్షించి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని, అభివృద్ధి పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద అర్హులైన ప్రతి జాబ్‌కార్డు దారుకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లు, అటవీ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, రేషన్ బియ్యం పారదర్శకంగా పంపిణీ చేయాలని తెలిపారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల్లో సమాన పని దినాలు, సమాన వేతనం అమలు చేయాలని, అనుమతులు లభించిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులకు యూరియా యాప్ వినియోగంపై క్షేత్రస్థాయిలో సహాయం అందించాలని పేర్కొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్నచోట పరిష్కారం చూపాలని, నిర్మాణాల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, భైంసా సమీప జాతీయ రహదారిపై ప్రమాదకర బ్లాక్‌స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, బాసర వంతెనను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కోరారు.
పారదర్శకంగా పథకాల అమలు : కలెక్టర్ భవేష్ మిశ్రా
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ మ్యాప్‌లు లేని 14 గ్రామాల్లో సర్వేలు, 70 గ్రామాల్లో రీ-సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు. శాఖల వారీగా అధికారులు తమ పురోగతిని వివరించారు. జిల్లాలో 1.74 లక్షల జాబ్‌కార్డుదారులకు ఉపాధి కల్పిస్తున్నట్లు, ఇందిరమ్మ ఇండ్ల కింద 2,136 గృహాలు పూర్తి చేసి రూ.146 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకానికి రూ.17.74 కోట్లు వ్యయం చేసినట్లు, 20 పీఎం శ్రీ పాఠశాలలకు రూ.1.34 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లాలో 2.49 లక్షల రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు, 41,950 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు వివరించారు. పీఎం కిసాన్ పథకం కింద 53 వేల మంది రైతులకు రూ.32 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.సమావేశంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక, బైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్‌వో రాథోడ్ రమేష్, డీఆర్‌డీవో విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






