సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడి రక్షణ.. నిందితుడి అరెస్ట్

by Taduka Kalyani |

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఇటీవల కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల బాలుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఆర్‌పీఎఫ్ సిబ్బంది సహకారంతో సురక్షితంగా రక్షించి, కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడి రక్షణ.. నిందితుడి అరెస్ట్
X

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఇటీవల కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల బాలుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఆర్‌పీఎఫ్ సిబ్బంది సహకారంతో సురక్షితంగా రక్షించి, కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. జీఆర్‌పీ డిఎస్పి జావిద్ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తల్లి పక్కనే నిద్రిస్తున్న బాలుడిని షేక్ అహ్మద్ అలీ సాహెబ్ (42) అనే వ్యక్తి అపహరించాడు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చింతల్‌కు చెందిన నిందితుడు వృత్తిరీత్యా మాస్టర్ కుక్‌గా పనిచేస్తున్నాడు. పోలీసుల విచారణలో, తనకు ముగ్గురు కుమార్తెలు మాత్రమే ఉండటంతో ఒక కుమారుడిని పెంచుకోవాలనే ఉద్దేశంతో బాలుడిని కిడ్నాప్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. బాలుడిని తన ఇంటికి తీసుకెళ్లిన అనంతరం కుటుంబ సభ్యులు, పొరుగువారు పోలీసులకు అప్పగించాలని సూచించినా అతను పట్టించుకోలేదు. బాలుడి కిడ్నాప్ వార్తలు మీడియాలో రావడంతో భయపడిన నిందితుడు బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి రోడ్డుపై దొరికాడని తప్పుడు సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసులు అనుమానంతో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌ను సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బి. సాయీశ్వర్ గౌడ్, ఎస్‌ఐలు టి. మాధవ్, ఎస్.వి. సుబ్బారెడ్డి, క్రైమ్ టీమ్, మహిళా పోలీసులు మరియు ఆర్‌పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో, రైల్వే పోలీసు అధికారులు గోనే సందీప్ మరియు ఎస్.ఎన్. జావేద్ పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు.

Next Story