ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : అసదుద్దీన్ ఒవైసీ

by Batti.Sumithra |

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ ) ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు చురుకుగా పాల్గొని తమ వివరాలను నమోదుచేసుకోవాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : అసదుద్దీన్ ఒవైసీ
X

దిశ, చంపాపేట్ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ ) ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు చురుకుగా పాల్గొని తమ వివరాలను నమోదుచేసుకోవాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా తనతో పాటు కుటుంబ సభ్యులందరి ఎన్యూమరేషన్ ఫారమ్ నింపి, ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొంటూ, ప్రతి కుటుంబం తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారమ్ నింపిన అనంతరం ఓవైసీ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ తమతో పాటు కుటుంబ సభ్యుల ఫారమ్‌లను పూర్తిగా నింపి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఓఎల్ )కు తప్పనిసరిగా అందజేయాలని కోరారు.

ఓటరు జాబితాలో సరైన వివరాలు నమోదు కావడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. ఫారమ్ నింపే సమయంలో ఎలాంటి సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఎదురైనా, తమ ప్రాంతంలోని ఏఐఎంఐఎం కార్యకర్తలను సంప్రదించాలని లేదా దారుస్సలాం కేంద్ర కార్యాలయానికి వచ్చి సహాయం పొందవచ్చని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవసరమని అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.

Next Story