వణికిస్తున్న ‘సెరిబ్రల్ మలేరియా’.. జార్ఖండ్‌లో ముగ్గురు చిన్నారులు మృతి

by Kema Shiva Kumar |

జార్ఖండ్‌లో తీవ్రమైన 'సెరిబ్రల్ మలేరియా' బారిన పడి ముగ్గురు పిల్లలు మరణించడం కలకలం రేపుతోంది.

వణికిస్తున్న ‘సెరిబ్రల్ మలేరియా’.. జార్ఖండ్‌లో ముగ్గురు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే దోమలు విపరీతంగా పెరగడంతో మలేరియా (Malaria) వ్యాప్తి ఎక్కువైంది. ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ‘సెరిబ్రల్ మలేరియా’ (Cerebral malaria) బారిన పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఎందుకు అంత ప్రమాదమంటే..

సాధారణంగా మలేరియా అనేది ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. వర్షపు నీరు నిలిచిపోయే చోట ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి. అయితే, కొన్నిసార్లు మలేరియా ముదిరిపోయి మెదడుపై ప్రభావం చూపినప్పుడు దానిని సెరిబ్రల్ మలేరియా అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ (Plasmodium falciparum) అనే పరాన్నజీవి వల్ల ఈ తీవ్రమైన ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు ఇన్ఫెక్షన్‌కు గురైన రక్తకణాలు మెదడులోని చిన్న రక్తనాళాలను బ్లాక్ చేస్తాయి. దీంతో మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయి వాపు రావడం, మెదడు దెబ్బతినడం జరుగుతుంది.

సెరిబ్రల్ మలేరియా లక్షణాలు ఇవే..

ఈ సెరిబ్రల్ మలేరియా వచ్చిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, గందరగోళానికి గురవ్వడం, కోమాలోకి వెళ్లడం, విపరీతమైన ఫిట్స్ వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చాలా వేగంగా చూపిస్తుంది. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Next Story