ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: మల్దకల్ ఎంఈవో

by Jakkula.Mamatha |

మల్దకల్ మండల కేంద్రంలోని MRC(సమావేశాల కార్యాలయ) ప్రాంగణంలో మండల విద్యాశాఖ అధికారి(MEO) ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: మల్దకల్ ఎంఈవో
X

దిశ, మల్దకల్: మల్దకల్ మండల కేంద్రంలోని MRC(సమావేశాల కార్యాలయ) ప్రాంగణంలో మండల విద్యాశాఖ అధికారి(MEO) ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని MEO తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనేక రకాల వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు(యూనిఫాంలు) మరియు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తోందని గుర్తుచేశారు.

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందుతుందని వివరించారు. తల్లిదండ్రులందరూ ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్తులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (HM), ఉపాధ్యాయ బృందం, 'అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ' MRC సిబంది విజయ్, వెంకటేష్ , పరమన్న, పద్మ, నర్సమ్మ, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Next Story