ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది జవాబుదారీతనంతో వ్యవహరించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

by Batti.Sumithra |

ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది తప్పనిసరిగా ప్రజలతో క్షేత్రస్థాయిలో సత్సంబంధాలు కలిగి, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ పేర్కొన్నారు.

ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది జవాబుదారీతనంతో వ్యవహరించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ, ఇచ్చోడ : ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది తప్పనిసరిగా ప్రజలతో క్షేత్రస్థాయిలో సత్సంబంధాలు కలిగి, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో పోలీసు సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. గ్రామీణ స్థాయిలో ప్రజలతో ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది సామరస్యపూర్వకంగా మెలగాలని సూచించారు. విధుల పట్ల క్రమశిక్షణతో పాటు నిజాయితీతో వ్యవహరిస్తూ, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, వర్టికల్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు.

ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం "అరైవ్ అలైవ్" కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని తెలిపారు. అలాగే "కాకి కిడ్స్" కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత, ప్రజల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా గంజాయి నిర్మూలనలో చురుకుగా విధులు నిర్వహించి ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఐపీఎస్, ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్ రమేష్, ఎస్‌ఐ కె. నరేష్ కుమార్, ఎస్‌ఐలు ఈశ్వర్, రామకృష్ణతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story