పోలియో రహిత భారత్‌కు ప్రతి తల్లిదండ్రి సహకరించాలి: మాజీ డిప్యూటీ మేయర్

by Jakkula.Mamatha |

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పిలుపునిచ్చారు.

పోలియో రహిత భారత్‌కు ప్రతి తల్లిదండ్రి సహకరించాలి: మాజీ డిప్యూటీ మేయర్
X

దిశ, సికింద్రాబాద్: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో–2026 కార్యక్రమాన్ని ఆదివారం లాలాపేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఆమె, తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి చిన్నారి ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు.

ప్రతిసారీ రెండు చుక్కల పోలియో మందు వేయించడం ద్వారా పోలియో మహమ్మారిపై శాశ్వత విజయాన్ని సాధించవచ్చు. తల్లిదండ్రులు ఈ జాతీయ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. శోభన్ రెడ్డి మాట్లాడుతూ.. పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులకు రోగనిరోధక శక్తిని పెంపొందించే అత్యంత కీలక ప్రజారోగ్య కార్యక్రమమని తెలిపారు. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికీ, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్నందున అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story