స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్‌కు ఐసీసీ షాక్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 12 పాయింట్ల కోత

by Malleboina Mahesh |

స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ భారీ షాక్.. డబ్ల్యూటీసీ (WTC) పట్టికలో 12 పాయింట్ల కోత, మ్యాచ్ ఫీజులో 50% జరిమానా!

స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్‌కు ఐసీసీ షాక్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 12 పాయింట్ల కోత
X

దిశ, వెబ్ డెస్క్: స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు ఉహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో ఓవల్ (The Oval) మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవిచూసిన ఇంగ్లాండ్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మరో గట్టి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయనందుకు (Slow Over-rate) గానూ ఇంగ్లాండ్ జట్టుపై ఐసీసీ తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ప్రస్తుత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) పాయింట్ల పట్టిక నుండి ఇంగ్లాండ్‌కు చెందిన 12 విలువైన పాయింట్లను కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దీంతో పాటు జట్టులోని ఆటగాళ్లందరికీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా కూడా విధించింది.

నిర్ణీత సమయం, అదనపు మినహాయింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత లక్ష్యం కంటే 12 ఓవర్లు వెనుకబడి ఉన్నట్లు అంపైర్లు గుర్తించారు. డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం.. తక్కువగా వేసిన ప్రతి ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున మొత్తం 12 పాయింట్లను ఐసీసీ కోసేసింది. ఒక టెస్టు మ్యాచ్ గెలిస్తే వచ్చే పాయింట్లను ఇంగ్లాండ్ ఇలా స్లో ఓవర్ రేట్ వల్ల నష్టపోవడం గమనార్హం. ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ జో రూట్ (Joe Root) ఈ తప్పిదాన్ని అంగీకరించడంతో మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఎలాంటి అధికారిక విచారణ లేకుండానే ఈ శిక్షను ఖరారు చేశారు.

ఈ 12 పాయింట్ల కోత కారణంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ జట్టు పాయింట్ల శాతం (Points Percentage) 34.72 నుండి ఒక్కసారిగా 26.38 శాతానికి పడిపోయి 7వ స్థానానికి పడిపోయింది. దీనివల్ల వారి ఫైనల్ ఆశలకు భారీ విఘాతం కలిగింది. కాగా, ఈ రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు 253 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టెస్ట్ మ్యాచ్ జూన్ 25 నుండి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ప్రారంభం కానుంది.

Next Story