- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్‌తోనే కులాల కుంపటి: మాజీ మంత్రి నారాయణస్వామి
రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వల్లే కులాల కుంపటి రాజుకుంటోందని వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..

దిశ, చిత్తూరు ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వల్లే కులాల కుంపటి రాజుకుంటోందని వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏనాడు కులాల పేరుతోఓట్లు అడగలేదన్నారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన దళిత యువకుడు సాయికృష్ణ మృతి వెనుక ఉన్న అసలైన ‘బిగ్ బాస్’ ఎవరో తేలాలని, ఈ దారుణంపై నిష్పక్షపాతంగా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమిళనాడులో లాకప్ డెత్ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష పడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. "గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సొంత కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ విచారణకు వెనుకాడలేదు. అదే స్ఫూర్తితో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా దళిత యువకుడు సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలి. అప్పుడే బాధ్యులైన ఎంతటి పెద్దవారికైనా శిక్ష పడుతుంది" అని నారాయణస్వామి పేర్కొన్నారు.
మరో దళిత యువకుడిని సీఐ నాగరాజు తీవ్రంగా హింసించడం వల్లే అతడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈ ఘటనపైనా ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత మహిళ (అనిత) హోం మంత్రిగా ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాల, మాదిగ సామాజిక వర్గాలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని, దళితులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతలు తక్షణమే దళితులపై దాడులను అరికట్టాలని, లేనిపక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో బాధితుల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని నారాయణస్వామి హెచ్చరించారు.






