హాల్‌మార్క్‌ నిబంధనలకు పాతర.. అబిడ్స్‌లో 1.6 కిలోల బంగారం సీజ్

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్‌ అబిడ్స్ లో ఉన్న ఓ జ్యువెలరీ దుకాణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

హాల్‌మార్క్‌ నిబంధనలకు పాతర.. అబిడ్స్‌లో 1.6 కిలోల బంగారం సీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ అబిడ్స్ లో ఉన్న ఓ జ్యువెలరీ దుకాణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన హాల్‌మార్క్ నిబంధనలను ఉల్లంఘించి విక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. ఏకంగా 1.6 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. బీఐఎస్ నిబంధనల ఉల్లంఘన కింద సదరు దుకాణ యాజమాన్యంపై తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

బీఐఎస్ హాల్‌మార్క్ లేని బంగారం..

తనిఖీల సమయంలో, తప్పనిసరిగా ఉండాల్సిన బీఐఎస్ హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను సదరు షాపులో వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. కొన్ని నగలపై పాత హాల్‌మార్క్ ముద్రలు ఉన్నట్లు కూడా తేల్చారు. నిబంధనల ప్రకారం ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. దీంతో షాపులో ఉన్న ఉంగరాలు, నెక్లెస్‌లు, పెండెంట్లు సహా మొత్తం సుమారు 1.6 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బీఐఎస్ కేర్ యాప్ ద్వారా నగల ప్రామాణికత నిర్ధారించుకోవాలి

ఈ సందర్భంగా బీఐఎస్ బ్రాంచ్ హెడ్ పి.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా బీఐఎస్ లోగో, స్వచ్ఛతను తెలిపే మార్క్,ఆరు అంకెల హెచ్‌యూఐడీ నంబర్ ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచించారు. కొనుగోలుకు ముందే బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఆ నగల ప్రామాణికతను నిర్ధారించుకోవాలని కోరారు. ఎవరైనా హాల్‌మార్క్ లేని నగలు విక్రయించినా, బీఐఎస్ మార్క్‌ను దుర్వినియోగం చేసినా ఆ యాప్ ద్వారానే తమకు ఫిర్యాదు చేయవచ్చని, లేదా సమీపంలోని బీఐఎస్ కార్యాలయంలో సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.ప్రతి జ్యువెలరీ వ్యాపారి చట్టప్రకారం హాల్‌మార్కింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, బీఐఎస్ ధ్రువీకరించిన నాణ్యమైన ఆభరణాలను మాత్రమే ప్రజలకు విక్రయించాలని ఆయన హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి

వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు, మార్కెట్‌లో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు, మార్కెట్ సర్వైలెన్స్ కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన తర్వాత వ్యాపారుల నుంచి తప్పనిసరిగా ఇన్‌వాయిస్ తీసుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్, డైరెక్టర్ అండ్ సైంటిస్ట్, ఈ సత్తు సవిత నేతృత్వంలో బీఐఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.

Next Story