- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటితో భానుడికి బై బై.. రేపటి నుంచి వరుణుడు ఎంట్రీ
గత 20 రోజుల నుంచి భగ్గుమంటున్న ఎండలు నేటితో వీడ్కోలు పలకనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : గత 20 రోజుల నుంచి భగ్గుమంటున్న ఎండలు నేటితో వీడ్కోలు పలకనున్నాయి. వేసవి ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జూన్ 1 నుంచి ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలియజేస్తున్నారు. ఈ వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గనున్నాయి. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36-38 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉండగా.. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న తీవ్ర ఎండలు కాస్త తగ్గి ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే వరకు అడపా దడపా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
అలాగే జూన్ 5 తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 35-36 డిగ్రీలు, ఉత్తర, తూర్పు తెలంగాణలో 38-39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక నైరుతి రుతుపవనాలు జూన్ 5న కేరళలోకి అడుగు పెడుతుండగా.. తెలంగాణలోకి జూన్ రెండో వారంలో అనగా జూన్ 10 నుంచి 12 మధ్య ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే అకస్మాత్తుగా కురిసే వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.






