కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఆక్రమణల పర్వం

by Jakkula.Mamatha |

కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో అక్రమార్కుల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఆక్రమణల పర్వం
X

దిశ,కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో అక్రమార్కుల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. ప్రభుత్వ భూములు, నాళాలు మాత్రమే కాకుండా ఏకంగా ప్రజలు నడిచే రోడ్లనే బడా బాబులు మింగేస్తుంటే మున్సిపల్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఏళ్ల తరబడి కళ్ల ముందే కోట్లాది రూపాయల విలువైన ప్రజా రహదారులను ఆక్రమించి భారీ షాపులు, షోరూమ్‌లు వెలుస్తున్నా.. అధికారులు చోద్యం చూడటం వెనుక భారీ స్థాయిలో మామూళ్ల పంపిణీ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకుని, రోజువారీ వ్యాపారంతో పొట్టపోసుకునే పేద, మధ్యతరగతి జీవులపై మున్సిపల్ అధికారులు చూపే ప్రతాపం అంతా ఇంతా కాదు.

ట్రాఫిక్ సమస్యలంటూ వారిపై జరిమానా విధించడం, బండ్లను బలవంతంగా జప్తు చేయడం వంటి చర్యలతో హడావుడి చేసే అధికారులు అదే రోడ్లను నిలువునా ఆక్రమించి శాశ్వత కట్టడాలు లేపిన బడా వ్యాపారవేత్తల వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడుతున్నారు. అధికారుల ఈ పక్షపాత వైఖరి, పేదోడికి ఒక న్యాయం.. పెద్దోడికి ఒక న్యాయమా అంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలో ప్రధాన కాలువలు, రహదారుల పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాలు అక్రమార్కుల పಲవుతున్నాయి. వీటికి కొందరు మున్సిపల్ నాయకులు, రాజకీయ నేతలు వెన్నుదన్నుగా నిలుస్తూ అక్రమ కట్టడాలకు అండగా ఉంటున్నారు. కోట్ల రూపాయల విలువైన రోడ్డు కాపాడాల్సిన వారే మామూళ్లకు కక్కుర్తి పడి అక్రమార్కులకు వత్తాసు పలకడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు గురవుతున్నారు.

ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటాం: మున్సిపల్ కమిషనర్ భట్టు తిరుపతి

పట్టణంలో ఈ అక్రమ కట్టడాల వ్యవహారంపై కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోరగా గతంలో ఉన్న కమిషనర్ హయాంలో ఏం జరిగిందో, ఎలాంటి ఆక్రమణలకు తావిచ్చారో నాకు తెలియదు. కానీ, ప్రస్తుత పాలనలో మున్సిపల్ స్థలాలు, రోడ్డు ఆక్రమణకు గురైతే మాత్రం సహించేది లేదు. ఎక్కడైనా అక్రమ కట్టడాలు వెలిస్తే వాటిపై తప్పకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు.

Next Story