నానక్‌రామ్‌గూడ సర్కిల్‌లో రూ. 100 కోట్ల గ్రీనరీ స్థలం ఆక్రమణ

by Malleboina Mahesh |

నానక్‌రామ్‌గూడ సర్కిల్‌లో రూ. 100 కోట్ల గ్రీనరీ స్థలం కబ్జా.. సర్వే నంబర్ మార్చి ల్యాండ్ మాఫియా దందా.. హెచ్ఎండీఏ నిర్లక్ష్యంపై 'హైడ్రా'కు ఫిర్యాదు!

నానక్‌రామ్‌గూడ సర్కిల్‌లో రూ. 100 కోట్ల గ్రీనరీ స్థలం ఆక్రమణ
X

దిశ, శేరిలింగంపల్లి : రోడ్డు పక్కన ఓ నిరుపేద జీవనోపాధి కోసం చిన్న టీ కొట్టు పెడితే కబ్జా చేశావంటూ జేసీబీ తో కూల్చివేసే హెచ్ఎండీఏ అధికారులు కోట్లు విలువచేసే గ్రీనరీ స్థలాన్ని బడాబాబులు కబ్జా చేస్తే వాటి జోలికి వెళ్లడం లేదు. ఐటీ కారిడార్‌ను, ఎయిర్ పోర్టుకు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసే నానక్‌రాంగూడ జంక్షన్‌కు ఆనుకొని ఉన్న గ్రీన్ బెల్ట్ స్థలం కబ్జాకు గురైంది. కోట్ల విలువ చేసే ఖరీదైన స్థలాన్ని హెచ్ఎండీఏ అధికారులు ప్రైవేటు వ్యక్తులకు ధారా ధాత్తం చేస్తున్నారు. హెచ్ఎండీఏ ఆస్తులు అభివృద్ధి, పరిరక్షణ కోసం ఆ శాఖకు చెందిన కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కొలువుతీరారు. నానక్‌రాంగూడ సర్కిల్ నిర్మాణం రెండెకరాల పైబడి విస్తరించి ఉంది.

రింగ్ వలయం చుట్టూ గ్రీనరీ అభివృద్ధి చేసేందుకు స్థలాలను కేటాయించారు. ఇక్కడే అధికారులు, కబ్జాదారులు మాస్టర్ మైండ్ కు పదును పెట్టారు. సుమారు 100 కోట్లు విలువ చేసి స్థలాన్ని ఉద్దేశపూర్వకంగా ఖాళీగా వదిలిపెట్టారు. సర్వే నెంబర్ 54 లో సుమారు వెయ్యి గజాల స్థలం ఉండగా దానిపై ఓ నిర్మాణ సంస్థ కన్ను పడింది. అప్పటికే కొంత భాగం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టా రు. మిగతా స్థలాన్ని చదును చేసి సర్వే నెంబర్ 55 లో ఉన్నట్లు డాక్యుమెంట్లు తయారు చేశారు. ఈ భూమిని కాపాడాలని నానక్ రాం గూడ సర్కిల్ గ్రీనరీ సేవ్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సుదీర్ఘకాలం పోరాటం చేస్తున్నారు. అన్ని రకాల ఆధారాలతో ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రుల వరకు హెచ్ఎండీఏ నుంచి సంబంధిత విభాగాల అధిపతులకు కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. అధికారులు కబ్జాదారులకు దాసోహం అయ్యారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని పలువురు వాపోయారు.

ఫిర్యాదులపై స్పందించిన హెచ్ఎండీఏ అధికారులు

నానక్‌రాంగూడ సర్కిల్ గ్రీనరీ అ భివృద్ధి ప్రాంతం సర్వే నంబర్ 54 లో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు, హెచ్ఎండీఏ లేఔట్ అప్రూవల్ ప్లాన్‌లో స్పష్టం గా ఉంది. గ్రీనరీ స్థలం ఆక్రమణ పరిశీలిస్తే విస్తు పోయే నిజాలకు వెలుగులోకి వస్తాయి. ఇందులో రోటరీ స్కూల్ వెడల్పు, వ్యాసార్థం, డ్రైనేజీలు, డివైడర్లు, కల్వర్టులు కనిపిస్తాయి. సర్వే నెంబర్ 55గా చూపించి ల్యాండ్ మాఫియా అనుమతులు తీసుకున్నారు. కానీ ఈ స్థలం హెచ్ఎండీఏ గ్రీన్ కారిడార్ సర్వేనెంబర్ 54 లో ఉంది. ల్యాండ్ మాఫియాకు ఉన్న పలుకుబడితో స్థలం కబ్జాకు స్కెచ్ వేశారు. ఈ ఆక్రమణపై హైడ్రా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులను కలిసి 29 రకాల ఆధారాలతో సమగ్ర నివేదిక రూపొందించి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని నానక్‌రాంగూడ సర్కిల్ గ్రీనరీ సేవ్ ప్రతినిధులు వాపోయారు.

అనుమతులు రద్దు చేసిన తర్వాత స్వాధీనం చేసుకోవాలి కదా..!

నానక్‌రామ్‌గూడ జంక్షన్ సర్కిల్ వద్ద సర్వే నం. 54 లో పచ్చదనం అభివృద్ధి కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి సర్వే నం.55 ఏ/ఏఏ/ఈలో ఉన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి ఆక్రమించారు. ఇది హెచ్ఎండీఏ ప్రణాళిక నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తుంది. నానక్‌రామ్‌ గూడ జంక్షన్ సర్కిల్ వద్ద ఉన్న గ్రీనరీ స్థలాన్ని ఆక్రమణదారులు సర్వే నం. 55 ఏ/ఏఏ/ ఈగా డాక్యుమెంట్లు తయారు చేసి తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు అధికారులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అనుమతి రద్దు చేసినప్పటికీ కబ్జాదారుల స్వాధీనంలోనే ఉంది. ఈ విషయంపై ఇరు శాఖల కమిషనర్లకు 09-04-2020, 09-02-2021 నాటి లేఖల మేరకు భవన నిర్మాణ అనుమతి (ఫైల్ నం. 2/ సీ20/14466/2019 అండ్ అనుమతి నం. 2/సీ20/17011/ 2019, తేదీ: 26-11-2019) రద్దు చేశారు. ఆ స్థలాన్ని హెచ్ఎండీఏ అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా.. ఖాళీగా వదిలిపెట్టారు.

Next Story