కేంద్ర మంత్రి కుమారుడికి రాహుల్ క్షమాపణలు

by Malleboina Mahesh |

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ విచారం.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కుమారుడిపై వ్యాఖ్యల వ్యవహారంలో ఎంపీ హైకోర్టులో పిటిషన్!

కేంద్ర మంత్రి కుమారుడికి రాహుల్ క్షమాపణలు
X

దిశ, వెబ్ డెస్క్: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ తీవ్ర విచారం (Regret) వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టులో తన న్యాయవాది ద్వారా ఒక ప్రత్యేక దరఖాస్తును సమర్పించారు.

అసలు వివాదం ఏంటి?

గతంలో మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అప్పటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంపై, ముఖ్యంగా ఆయన కుమారుడు కార్తికేయ సింగ్‌ను ఉద్దేశిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కార్తికేయ సింగ్.. రాహుల్ గాంధీ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అవాస్తవాలు మాట్లాడారంటూ భోపాల్ కోర్టులో పరువు నష్టం (Defamation Case) దాఖలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది.

నా వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించినవి కావు

ఈ కేసును కొట్టివేయాలని, మినహాయింపు ఇవ్వాలని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన తాజా అప్లికేషన్‌లో.. నాటి ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలు కేంద్ర మంత్రి కుమారుడు కార్తికేయ సింగ్‌కు సంబంధించినవి కావని, పొరపాటున అలా జరిగిందని పేర్కొంటూ విచారం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శల నేపథ్యంలో జరిగిన ఈ పొరపాటును పరిగణనలోకి తీసుకుని కేసు తీవ్రతను తగ్గించాలని కోరారు. రాహుల్ గాంధీ స్వయంగా వెనక్కి తగ్గి విచారం వ్యక్తం చేయడంతో ఈ హై ప్రొఫైల్ పరువు నష్టం కేసు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story