- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ బడుల్లో ‘బిజినెస్’!
ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అడ్మిషన్లు, బుక్స్, యూనిఫామ్‌ల పేరుతో విచ్చలవిడిగా వసూళ్లకు తెగబడుతున్నారు. వార్షిక ఫీజులో సగం డబ్బులు ముందు కడితేనే పాఠ్యపుస్తకాలు ఇస్తామంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. తాము కుదుర్చుకున్న బుక్ స్టోర్లు, బట్టల షాపుల్లోనే సామగ్రి కొనాలంటూ కమీషన్ల దందాకు తెరలేపారు. కొన్ని పాఠశాలలు కనీస ప్రభుత్వ అనుమతులు, ఆటస్థలాలు, మరుగుదొడ్ల వంటి వసతులు లేకుండానే నడుస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల అక్రమాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు కంటితుడుపు చర్యలకే పరిమితమయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించి, అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
దిశ,ఆదిలాబాద్: విద్య సేవగా ఉండాల్సిన చోట వ్యాపారంగా మారుతుందన్న విమర్శలు జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తును ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు తల్లిదండ్రులపై భారీ ఆర్థిక భారం మోపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోథ్, ఉట్నూర్, ఇచ్చోడ తదితర ప్రాంతాల్లో స్కూల్ ఫీజులతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు, బ్యాగులు, షూస్, స్టేషనరీ వస్తువుల పేరుతో అదనపు వసూళ్లకు తెరలేపారు. ఇటీవల పలు విద్యార్థి సంఘాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పుస్తకాల విక్రయాలపై ఆందోళనలు చేపట్టి అధికారుల సహకారంతో వాటిని సీజ్ చేయించినా లాభం లేకుండా పోయింది. జిల్లా విద్యాశాఖ పరిధిలో 170 ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 50 వేల మంది విద్యార్థులు చదువుతుండడంతో, ఇక్కడ ప్రైవేట్ విద్య పెద్ద వ్యాపారంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫీజుల మోత... కమిషన్ల దందా..
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకే రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు, ప్రాథమిక తరగతులకు రూ.40వేలు, పదో తరగతికి ఏకంగా రూ.లక్ష వరకు ఫీజులు గుంజుతున్నాయి. దీనికి తోడు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టై, బెల్టులు వంటి వస్తువులను కూడా పాఠశాలల ద్వారానే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. మార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే వస్తువులను తమకు అనుబంధంగా ఉన్న బుక్ స్టోర్లలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు వార్షిక ఫీజులో 50 శాతం అడ్వాన్స్ చెల్లిస్తేనే పాఠ్యపుస్తకాలు అందజేస్తామని కరాఖండిగా చెబుతున్నాయి. బడి ప్రారంభానికి ముందే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి నిర్దిష్ట దుకాణాలకే వెళ్లాలని సూచిస్తుండడంతో, స్కూల్ యాజమాన్యాలు, వ్యాపారుల మధ్య భారీగా కమీషన్ల దందా నడుస్తోందన్న చర్చ సాగుతోంది.
అనుమతులు లేవు.. పర్యవేక్షణా లేదు..
జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు కనీసం పూర్తిస్థాయి ప్రభుత్వ అనుమతులు లేకుండానే అడ్మిషన్లు చేపట్టి తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, క్రీడా మైదానాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోయినా ఫీజుల వసూళ్లలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ విక్రయాలు, దోపిడీపై జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదులు అందినప్పటికీ కఠిన చర్యలు కరువయ్యాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ, అనుమతుల పరిశీలనపై ఉన్నతాధికారులు తక్షణమే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.






