600 గజాల ప్రభుత్వ భూమి కబ్జా..

by Ratna Kumari |

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అంబర్‌పేట పరిధిలోని పసుమాముల గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

600 గజాల ప్రభుత్వ భూమి కబ్జా..
X

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్ : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అంబర్‌పేట పరిధిలోని పసుమాముల గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సర్వే నంబర్ 451లో సుమారు 600 గజాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించి కోట్ల రూపాయల విలువైన ఆస్తికి కన్నం వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ఆదివారం దిశ పత్రికలో కథనం ప్రచురితమైనప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారులు రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిలో మట్టి లెవలింగ్ చేపట్టినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లుమూసుకుని ఉండటం వల్లే భూ ఆక్రమణలు పెరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై, వారికి సహకరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ భూమి ప్రభుత్వ భూమేనా..? ఆక్రమణలు నిజంగానే జరిగాయా? అనే అంశాలపై సంబంధిత రెవెన్యూ అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. స్థానికుల ఆరోపణలపై విచారణ అనంతరం పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Next Story