‘మా బాధను హెడ్‌లైన్‌గా మార్చొద్దు’.. ఇంట్లో స్నేహితుడి ఆత్మహత్య, వదంతులపై నటి పోస్ట్ వైరల్

by Ramesh Naini |

కన్నడ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్ కృషి తాపండ నివాసంలో ఆమె స్నేహితుడు వైశాఖ్‌ (45) ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

‘మా బాధను హెడ్‌లైన్‌గా మార్చొద్దు’.. ఇంట్లో స్నేహితుడి ఆత్మహత్య, వదంతులపై నటి పోస్ట్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కన్నడ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్ కృషి తాపండ నివాసంలో ఆమె స్నేహితుడు వైశాఖ్‌ (45) ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మరణంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల వదంతులు, అసత్య ప్రచారాలు జోరుగా సాగుతుండటంపై నటి కృషి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ వార్తలపై ఇకనైనా ఆపాలని ఆమె సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు.

కృషి తాపండ భావోద్వేగ పోస్ట్

‘ఇలాంటి పోస్ట్‌ చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నాకు అన్ని వేళలా అండగా ఉండే మిత్రుడి మరణం నాకు తీరని లోటు. మేమంతా ఒక మంచి స్నేహితుడిని కోల్పోతే.. ఒక కుటుంబం తమ కొడుకును కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంది. ఇలాంటి సమయంలో కొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, ఒకరి ప్రాణ నష్టాన్ని తమ హెడ్‌లైన్‌గా మార్చుకుని కట్టుకథలు అల్లుతున్నారు’ అని కృషి వాపోయారు. సంతోషాన్ని ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ, ఇతరుల కన్నీళ్లకు కారణం కావొద్దని ఆమె చేతులు జోడించి అభ్యర్థించారు. దయచేసి తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని, ప్రశాంతంగా బాధను దిగమింగుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.

అసలేం జరిగిందంటే..?

ఓ వ్యాపారవేత్తను నగదు కోసం బెదిరించిన కేసులో వైశాఖ్ అరెస్టయ్యాడు. నెల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చి, అప్పటినుంచి బెంగళూరులోని నటి కృషి నివాసంలోనే ఉంటున్నాడు. డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆయన, బుధవారం రాత్రి కృషి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. చనిపోయే ముందు వైశాఖ్ తనకు ఫోన్ చేశాడని, ఆ వెంటనే తాను అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చానని పోలీసుల విచారణలో నటి వెల్లడించారు. మృతుడికి 15 ఏళ్ల క్రితమే వివాహం కాగా, భార్య, ఒక కుమారుడు ఉన్నారు. వైశాఖ్ మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story