- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏనుగుల మంద బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి వచ్చిన ఏనుగుల మంద బీభత్సాన్ని సృష్టించింది. ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు

దిశ, వెబ్ డెస్క్: అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి వచ్చిన ఏనుగుల మంద బీభత్సాన్ని సృష్టించింది. ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక సంఘటన జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొకారో టౌన్ సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడ్కీపున్నూ (Barkipunnu) గ్రామంలో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఏనుగుల మంద నివాసాలపై దాడి చేసి బీభత్సం సృష్టించడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇళ్లలో నిల్వ ఉంచిన వరి ధాన్యం (Paddy) కోసం ఆహారం వెతుక్కుంటూ వచ్చిన ఏనుగులు ఈ దాడికి పాల్పడ్డాయి. ఏనుగులు ఇంటి గోడలను ధ్వంసం చేస్తున్న సమయంలో, లోపల నిద్రిస్తున్న గణేష్ కర్మాలి, భార్య భగియా దేవి (65), వారి బంధువు కమ్లి దేవి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, దురదృష్టవశాత్తు బయట ఉన్న ఏనుగులు వారిని చుట్టుముట్టి కాళ్లతో తొక్కి కిరాతకంగా చంపేశాయి. ఈ ఘటనలో మరో మహిళ కర్మీ దేవి కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న బొకారో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) సందీప్ షిండే బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అటవీ శాఖ తరపున కొంత తక్షణ ఆర్థిక సాయం అందజేయడం తో పాటు, నిబంధనల ప్రకారం ఒక్కో మృతికి మొత్తం ₹4 లక్షల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఏనుగుల మంద సమీప అడవుల్లోనే సంచరిస్తుండటంతో, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.






