మొహర్రం ఏర్పాట్లపై విద్యుత్ శాఖ ప్రత్యేక దృష్టి.. ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు

by Jakkula.Mamatha |

మొహర్రం పర్వదినం సందర్భంగా నిర్వహించనున్న బీబీ కా ఆలం సహా ప్రధాన ఊరేగింపులు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు విద్యుత్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

మొహర్రం ఏర్పాట్లపై విద్యుత్ శాఖ ప్రత్యేక దృష్టి.. ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు
X

దిశ, చంపాపేట్: మొహర్రం పర్వదినం సందర్భంగా నిర్వహించనున్న బీబీ కా ఆలం సహా ప్రధాన ఊరేగింపులు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు విద్యుత్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) స్వయంగా మొత్తం ఊరేగింపు మార్గాన్ని సందర్శించి విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై సమగ్ర తనిఖీ నిర్వహించారు. ప్రజల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, మతపరమైన కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించిన సీఎండీ, ఎలాంటి అంతరాయం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, వీధి దీపాలు, అత్యవసర బ్యాకప్ ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. మొహర్రం సందర్భంగా లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున చిన్నపాటి లోపానికి తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించేలా ప్రత్యేక సాంకేతిక బృందాలను సిద్ధంగా ఉంచాలని, 24 గంటల పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ మెట్రో జోన్, సూపరింటెండింగ్ ఇంజనీర్ సౌత్ సర్కిల్, డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సీబీడీ సిబ్బంది, ఎఫ్‌ఓసీ బృందాలు, సెక్షన్ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. మతపరమైన వేడుకల సమయంలో ప్రజల భద్రతతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడం విద్యుత్ శాఖ ప్రధాన బాధ్యతగా భావిస్తోందని అధికారులు తెలిపారు. మొహర్రం వేడుకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు. వర్షాకాల పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా విద్యుత్ సరఫరా వ్యవస్థ పై ప్రత్యేక నిఘా ఉంచి, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

Next Story