- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : గ్రామాన్ని మద్యపాన రహితంగా మార్చాలనే పట్టుదలతో జనగామ జిల్లా నష్కల్ గ్రామ పంచాయతీ ఒక కఠినమైన నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. గ్రామంలో రహస్యంగా బెల్ట్ షాపులు నడుపుతున్న ఆరుగురు వ్యక్తులను గుర్తించి, వారి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను పూర్తిగా తొలగించారు. గ్రామసభలో ప్రజలందరి సమక్షంలో తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం మేరకే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ శాతబోయిన రాజు అధికారికంగా ప్రకటించారు. ఈ ఊహించని చర్యతో గ్రామంలోని బెల్ట్ షాపుల నిర్వాహకుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
యువత భవిష్యత్తు కోసం కఠిన నిబంధనలు
నష్కల్ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉండటం వల్ల ఇప్పుడిప్పుడే పెరుగుతున్న యువత మద్యం వైపు ఆకర్షితులవుతున్నారని, తద్వారా వారు చెడు అలవాట్లకు బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకునే ప్రమాదం ఉందని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే యువతను, వారి కుటుంబాలను కాపాడుకోవడానికి మద్యపానాన్ని పూర్తిగా నియంత్రించాలని గతంలోనే గ్రామసభలో గట్టిగా తీర్మానించారు. ఇందులో భాగంగానే, ఊరిలో ఎవరైనా మద్యం విక్రయిస్తే వారి రేషన్ కార్డు, కరెంటు, ప్రభుత్వం నుండి వచ్చే ఇతర సంక్షేమ సౌకర్యాలను నిలిపివేస్తామని సర్పంచ్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ పొరపాటు చేసిన వారు "ఇకపై గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మేది లేదు" అని హామీ ఇస్తేనే, వారి ఇళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
మద్యపాన రహిత గ్రామమే లక్ష్యం
గొప్ప చరిత్ర, ఆధ్యాత్మిక విలువలు ఉన్న తమ నష్కల్ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన 'సంపూర్ణ మద్యపాన రహిత గ్రామంగా' తీర్చిదిద్దాలనే ఒకే ఒక్క లక్ష్యంతో సర్పంచ్ శాతబోయిన రాజు సారథ్యంలో ఊరి పెద్దలు, మహిళలు ఈ బృహత్తర నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ప్రజలందరితో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇకపై ఎలాంటి బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే సామాజిక బహిష్కరణ తరహా చర్యలు ఉంటాయని గ్రామస్తుల పూర్తి మద్దతుతో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు.






