పదవుల కోసం ప్రయత్నాలు.. మంత్రి పదవిపై ఎమ్మెల్యేల దృష్టి!

by Jakkula.Mamatha |

కాంగ్రెస్ పార్టీ నేతలు పదవుల పైన దృష్టి పెట్టారు. రాష్ట్ర మంత్రివర్గం మలివిడత విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు.

పదవుల కోసం ప్రయత్నాలు.. మంత్రి పదవిపై ఎమ్మెల్యేల దృష్టి!
X

దిశ, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నేతలు పదవుల పైన దృష్టి పెట్టారు. రాష్ట్ర మంత్రివర్గం మలివిడత విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాబినెట్ బెడ్త్‌లో చోటు కోసం ప్రయత్నాలు చేస్తుండగా మరికొంత మంది వారసులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్ మున్సిపల్ మేయర్ పీఠంతో పాటు ఆరు జిల్లాల్లో జడ్పీ పీఠాలను తమ వారసులకు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. పదవులే ఎజెండాగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించనున్నారు. మలివిడత విస్తరణ ఉండటంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విస్తరణలో జిల్లాకు రెండు మంత్రి పదవులు రాగా, మలి విడతలో మరో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

తొలివిడతలో బీసీ, ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వగా రెండో విడతలో రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. వీరిలో నర్సంపేటకు చెందిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మలివిడత విస్తరణ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతో పాటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర సామాజిక సమీకరణాల్లో భాగంగా క్యాబినెట్ మలివిడత విస్తరణ జరిగితే రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి లేదా రెండు మంత్రి పదవులు దక్కనున్నాయి. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన రెడ్డి ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వీరితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తనకు ఇచ్చిన హామీ పైన నిలదీస్తున్నారు.

వరంగల్ నుంచి కూడా రెండు దశాబ్దాలుగా రెడ్డిలకు మంత్రి వర్గంలో అవకాశం రాకపోవడంతో ఈ దఫా నేతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గం విస్తరిస్తుండటంతో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఢిల్లీ వరకు వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న ఆయన తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. ఆయనతో పాటు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ కూడా ప్రయత్నాలు చేశారు. ఢిల్లీలోని పెద్దలను కలిశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 20 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఉండటంతో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని..

ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తుండగా మరికొంత మంది ఎమ్మెల్యేలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఒక ఎమ్మెల్యే తమ వారసురాలిని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దించి మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక ఎమ్మెల్యే, మంత్రి తమ వారసురాలిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దించేందుకు సిద్ధం చేస్తున్నారు. పరకాల, వరంగల్ ఈస్ట్ లో ఏదో ఒక స్థానం నుంచి పోటీకి సన్నద్ధమవుతున్నారు. వీరే కాకుండా మిగతా ఎమ్మెల్యేలు తమ వారసులను జెడ్పీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా దించి పోటీ చేయించి జెడ్పీ పీఠాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సీనియర్ నేతలు కొంత మంది పోటీలో ఉన్న తమ వారసులను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు వారసులను దించి ప్రజాప్రతినిధులుగా నిలబెట్టగా మిగతా వారు అదే ప్రయత్నాల్లో ఉండటంతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న నేతలకు మింగుడు పడటం లేదు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారనుండటంతో ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారసుల పోటీలో సీనియర్ నేతలు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటి నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే రోజుల్లో ఎవరికి పదవులు వస్తాయో ఎవరు వారసులని దించుతారో తేలే అవకాశం ఉంది.

Next Story