హర్మూజ్ జలసంధి దిగ్బంధం : భారత్‌కు ముంచుకొస్తున్న చమురు కరువు.. ధరల మోత తప్పదా?

by Muthe.Rajitha |

హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా భారత్‌ చమురు కరువు ముప్పును ఎదుర్కోనుంది.

హర్మూజ్ జలసంధి దిగ్బంధం : భారత్‌కు ముంచుకొస్తున్న చమురు కరువు.. ధరల మోత తప్పదా?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ దేశాలు గల్ఫ్ యుద్ధం కారణంగా ఏదైతే జరగకూడదని భయపడ్డాయో అదే జరుగుతోంది. ప్రపంచ చమురు వ్యాపారానికి గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో భారత్‌కు రావాల్సిన క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశంలో త్వరలోనే తీవ్ర చమురు కొరత ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు ఆయిల్ ధరలు భారీగా పెరిగి ఆ ఎఫెక్ట్ నిత్యావసర ధరలపై పడనుంది

ముంచుకొస్తున్న చమురు కరువు ముప్పు

మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం పతాక స్థాయికి చేరడంతో, ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించింది. ప్రపంచ దేశాలకు హెచ్చరికగా వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని ఇరాన్ సైన్యం పూర్తిగా మూసివేసింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్‌లో సుమారు 20 నుండి 30 శాతం వాటా ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఇప్పుడు ఈ మార్గం బంద్ కావడంతో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ మరియు ఇరాక్ నుండి భారత్‌కు రావాల్సిన చమురు ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. భారత్ తన అవసరాలకు అవసరమైన చమురులో దాదాపు 80 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది, అందులో అధిక భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఈ ఆకస్మిక పరిణామంతో భారత ఇంధన రంగంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

భారీగా పెరగనున్న ధరలు

హర్మూజ్ మార్గం నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (Brent Crude) ధర ఒక్క రోజులోనే సుమారు 15% నుండి 20% వరకు పెరిగింది. నిన్నటి వరకు బ్యారెల్ ధర సుమారు 85 నుండి 90 డాలర్ల మధ్య ఉండగా, ఇరాన్ హెచ్చరికలు మరియు సరఫరా నిలిచిపోవడంతో అది ఇప్పుడు 110 నుండి 125 డాలర్ల మార్కును దాటేసింది. యుద్ధం గనుక మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే, చమురు ధరలు బ్యారెల్ కు 150 డాలర్ల మార్కును కూడా చేరుకోవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆకస్మిక పెరుగుదల వల్ల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల కరెన్సీ విలువ (రూపాయి) కూడా పడిపోయే ప్రమాదం ఉంది. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలో ఒక డాలర్ 1 పెరిగితేనే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు 50 నుండి 60 పైసల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరిగిన భారీ పెరుగుదల ప్రకారం రాబోయే రోజుల్లో భారత్‌లో ఇంధన ధరలు లీటరుకు ₹10 నుండి ₹15 వరకు పెరిగే ముప్పు పొంచి ఉంది.

ప్రత్యామ్నాయాల వైపు దృష్టి

ఇది రవాణా రంగంపై నేరుగా ప్రభావం చూపి, పప్పులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీస్తుంది. చమురు ధరల పెరుగుదల కేవలం వాహనదారులకే కాకుండా, రవాణా ఖర్చులు పెరగడం వల్ల అన్ని ధరలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. భారత ప్రభుత్వం ప్రస్తుతం తన వద్ద ఉన్న 'స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్' ఉపయోగించి పరిస్థితిని సమీక్షిస్తోంది. అయితే, ఈ దిగ్బంధం మరికొన్ని రోజులు కొనసాగితే దేశంలో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మరియు చమురు మంత్రిత్వ శాఖ ఇప్పటికే దౌత్యపరమైన చర్చలు జరుపుతూ, రష్యా వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు తెప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

Next Story