వైమానిక దాడుల ఎఫెక్ట్: తోర్ఖం సరిహద్దు వద్ద పాక్-ఆఫ్ఘన్ దళాల మధ్య హోరాహోరీ

by Malleboina Mahesh |

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. వైమానిక దాడుల నేపథ్యంలో తోర్ఖం వద్ద ఇరు దేశాల దళాలు భారీగా కాల్పులు జరుపుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది.

వైమానిక దాడుల ఎఫెక్ట్: తోర్ఖం సరిహద్దు వద్ద పాక్-ఆఫ్ఘన్ దళాల మధ్య హోరాహోరీ
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం (Tense atmosphere) నెలకొంది. గత కొద్ది నెలలుగా ఇరువురు పరస్పరం దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘాన్ పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో పదుల సంఖ్యలు ఆఫ్ఘన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన తాలిబన్లు (Taliban) పాక్ సైన్యం లక్ష్యంగా ఫిబ్రవరి 24న రాత్రి మెరుపు దాడికి పాల్పడ్డారు. దీంతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని నంగర్హర్ ప్రావిన్స్, తొర్ఖం, తీరా లోయ ప్రాంతాల్లో ఇరు దేశాల దళాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయి. ఇరుపక్షాలు మెషిన్ గన్లు, మోర్టార్ల వంటి భారీ ఆయుధాలను ఉపయోగించాయి.

ఈ ఘర్షణల్లో ప్రాణ నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతున్నప్పటికీ, రెండు దేశాల ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా మరణాల సంఖ్యను ధృవీకరించలేదు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక వాణిజ్య మార్గమైన తొర్ఖం సరిహద్దును పాకిస్తాన్ తాత్కాలికంగా మూసివేసింది. ఈ వివాదానికి ప్రధాన కారణం గత వారం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, బన్నూ ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడులే. ఈ దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు ఆఫ్ఘన్ గడ్డపై ఉన్నారని ఆరోపిస్తూ పాక్ సైన్యం వైమానిక దాడులు జరిపింది.

ఇందులో సుమారు 70-80 మంది ఉగ్రవాదులు హతం అయ్యారని పాక్ పేర్కొంది. అయితే, ఈ దాడుల్లో 18 మంది అమాయక పౌరులు చనిపోయారని తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం సరిహద్దు వెంబడి పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఒకవేళ తాలిబన్లు మళ్ళీ కయ్యానికి వస్తే మరింత కఠినంగా స్పందిస్తామని పాకిస్తాన్ హెచ్చరిస్తుండగా, తమ భూభాగం పై దాడిని సహించబోమని ఆఫ్ఘన్ స్పష్టం చేస్తోంది.

Next Story