- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరులో నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల ప్రచారం!
మహబూబ్‌నగర్‌లో అనుమతులు లేని 'ఢిల్లీ పబ్లిక్ స్కూల్' విద్యా దందా; విద్యాశాఖ ఆదేశించినా హోర్డింగ్స్ తొలగించని మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు.

దిశ,మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలో ఓ భారీ విద్యా దందా బహిరంగంగానే సాగుతోంది. కనీస అనుమతులు, ప్రభుత్వ గుర్తింపు లేకపోయినా జాతీయ స్థాయి బ్రాండ్ 'ఢిల్లీ పబ్లిక్ స్కూల్' పేరుతో అడ్మిషన్ల వేట మొదలైంది. ఈ అక్రమ వ్యాపారానికి మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పరోక్షంగా కవచంలా నిలవడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విద్యాశాఖ లేఖ బుట్టదాఖలు..
ఈ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని, ప్రధాన కూడళ్లలో వెలసిన భారీ హోర్డింగ్‌లను తక్షణమే తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు విద్యాశాఖ నుంచి అధికారికంగా వినతిపత్రం అందింది. అయితే రోజులు గడుస్తున్నా సదరు హోర్డింగ్‌లను తొలగించడంలో మున్సిపల్ అధికారులు ప్రదర్శిస్తున్న జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒక ప్రభుత్వ శాఖ మరో శాఖ ఇచ్చిన లేఖను కనీసం ఖాతరు చేయకపోవడం అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని ఎత్తి చూపుతుంది.
కాసుల కక్కుర్తా? లోపాయికారి ఒప్పందాలా?
నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం కల్పిస్తున్న కార్పొరేషన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం హోర్డింగ్ ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం కోసమే విద్యార్థుల జీవితాలను పణంగా పెడుతున్నారా? లేక సదరు విద్యా సంస్థ యాజమాన్యం వెనుక ఉన్న బలీయమైన శక్తుల ఒత్తిడికి తలొగ్గి మౌనంగా ఉంటున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపు లేని సంస్థలకు కార్పొరేషన్ స్థలాల్లో ప్రచారం కల్పించడం చట్టరీత్యా తప్పని తెలిసినా, అధికారులు మిన్నకుండిపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటో విచారణ జరపాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అంధకారంలో విద్యార్థుల భవిష్యత్తు
నగరంలోని ప్రధాన రహదారులపై ఉన్న భారీ ప్రకటనలను చూసి, అది నిజంగానే గుర్తింపు పొందిన పాఠశాల అని నమ్మి అమాయక తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలలో చేర్పిస్తున్నారు. అడ్మిషన్ల పేరుతో వేల రూపాయల ఫీజులను దండుకుంటున్న యాజమాన్యం రేపు విద్యాశాఖ గట్టి చర్యలు తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క విద్యా సంవత్సరం నష్టపోయినా పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని, ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని వారు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి అనుమతులు లేకుండా వెలుస్తున్న విద్యాసంస్థలను మూసివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
జిల్లా కేంద్రంలో కొన్ని పాఠశాలలు ఎటువంటి అనుమతులు లేకుండా ఒకవైపు ప్రచారాలు.. మరోవైపు అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని గుర్తించి మూసి వేయడం జరిగింది. అనుమతులు లేకుండా ఉన్న పాఠశాలల నిర్వాహకులు పట్టణంలో పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రచారాలు చేస్తున్నారు. అటువంటి పాఠశాలల ప్రచారాల హోర్డింగులను తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాము.:- ప్రవీణ్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి
ఫైల్స్ రాలేదు..
జిల్లా కేంద్రంలో ప్రచారం జరుగుతున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తదితరాలకు సంబంధించి మాకు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ఫైల్స్ రాలేదు. ఈ కారణంగా ఆ విద్యాసంస్థల కార్యాలయాలను సీజ్ చేయించాం. వారు నిబంధనలను అధిగమించి వ్యవహరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కఠిన చర్యలు తీసుకుంటాం. :- లక్ష్మణ్ సింగ్, ఎంఈఓ, మహబూబ్ నగర్.






