- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఈడీ దూకుడు.. రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణను వేగవంతం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణను వేగవంతం చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన ఈడీ అధికారులు, తాజాగా హైదరాబాద్‌లోని రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఆ ఛార్జిషీటును పరిగణలోకి తీసుకుని పరిశీలించిన కోర్టు విచారణకు స్వీకరించింది.
రూ.11 కోట్ల విలువైన బినామీ ఆస్తులు
కాగా, నయీం తన గ్యాంగ్‌తో సంపాదించిన సుమారు రూ.11.30 కోట్ల విలువైన 91 ఆస్తులను ఈడీ ఇప్పటికే గుర్తించి మొత్తం 10 మందిపై అభియోగాలు మోపింది. వారిలో పాశం శ్రీనివాస్, హసీనా బేగం, మహమ్మద్ తాహెరా బేగం, మహమ్మద్ సలీమా బేగం, మహమ్మద్ అబ్దుల్ సలీమ్, అహేలా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్దౌస్ అంజుమ్, మహమ్మద్ ఆరిఫ్,హీనా కౌసర్‌లు ఉన్నారు. 91 ఆస్తులు బలవంతంగా బాధితులను బెదిరించి రిజిస్టర్ అయినట్లుగా గుర్తించారు. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోని షాపింగ్ కాంప్లెక్స్‌లు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై బినామీలుగా రిజిస్టర్ చేసినట్లుగా అధికారులు ధృవీకరించారు. ఇక కేసులో నయీం భార్య హసీనా బేగంతో పాటు పలువురు కుటుంబ సభ్యుల పేర్లను ఈడీ తన ఛార్జిషీట్‌లో స్పష్టం చేసింది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా వారు విచారణకు హాజరుకాకపోవడం, ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయకపోవడంతో ఈడీ కఠిన చర్యలకు సిద్ధమైంది. అవసరమైతే నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు (NBW) జారీ చేయాలని కూడా కోర్టుకు విన్నవించినట్లుగా తెలుస్తోంది.
పొలిటికల్, పోలీసు సంబంధాలపై ఈడీ ఫోకస్
గ్యాంగ్‌స్టర్ నయీంకు సహకరించిన కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ అధికారు ఫోకస్ పెట్టారు. అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎక్కడికి వెళ్లిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు తాజాగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను స్వీకరించిన నేపథ్యంలో నిందితులకు త్వరలోనే నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.
కేసులో ఈడీ ఎంట్రీ ఇలా..
నయీం 2016, ఆగస్టు నెలలో షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ (Encounter)లో మరణించిన విషయం తెలిసిందే. అతడి మృతితో బాధితులంతా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారించేందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. విచారణలో దాదాపు 250 కేసులు నమోదు చేయగా.. ఇందులో నయీం 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలపై గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఎంటరై దర్యాప్తు చేపడుతోంది.






